Inquiry Committee on Malakpet women death: హైదరాబాద్ మలక్‌పేట ప్రాంతీయ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన ప్రసూతి మరణాలపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఈ మేరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, పేట్లబురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతిలతో కూడిన త్రిసభ్య కమిటీ విచారణను చేపట్టింది.
వారం క్రితం ఇద్దరు గర్భిణులు కాన్పు కోసం మలక్‌పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా సిజేరియన్ అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలింతలు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై టీవీవీపీ కమిషనర్ ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టారు. బాలింతల మృతికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షనే కారణమని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి కూడా సమర్పించారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే కచ్చిత సమాచారం లభిస్తుందని వైద్యవర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై లోతుగా విచారించడానికి తాజాగా ఉన్నత స్థాయి బృందాన్ని నియమించిన ప్రభుత్వం వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మలక్‌పేట ఆసుపత్రిలోనే ప్రసవించిన మరో 18 మంది బాలింతలను ముందు జాగ్రత్తగా నిమ్స్‌లో చేర్పించి చికిత్స అందించారు. వీరిలో ఇద్దరికి కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డయాలసిస్ కూడా చేశారు. వీరిద్దరు మినహా అందరి ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్ఛార్జి చేశారు. డయాలసిస్ పొందుతున్న ఇద్దరు కూడా కోలుకుంటున్నారని వైద్యవర్గాలు తెలిపాయి.
ఇదీ జరిగింది..: మలక్‌పేట ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ఇద్దరు బాలింతలు ఇటీవల మృత్యువాత పడటం.. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే వారు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ నిరసనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లికి చెందిన సిరివెన్నెలను ఇటీవల కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి కాన్పు చేశారు.
ప్రసవం తర్వాత సిరివెన్నెల తీవ్ర అస్వస్థతకు గురైంది. గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జగదీశ్.. తన భార్య శివానిని కాన్పు కోసం మలక్‌పేట ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాబుకు జన్మనిచ్చిన తర్వాత శివాని ఆరోగ్య పరిస్థితి విషమించింది. గాంధీకి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఒకేసారి ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో.. మలక్‌పేట ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటాయి.
ఇవీ చదవండి:
- మలక్‌పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతికి అసలు కారణాలివే!
- మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ మూసివేత
- ఏడాదిన్నర చిన్నారిని చంపి తిన్న తోడేలు.. ప్రియుడి కోసం కుమార్తెను హత్య చేసిన తల్లి