కొవిడ్-19 నేపథ్యంలో దేశీయంగా టీకా ఉత్పత్తి చేసిన ఘనత భారత్ బయోటెక్ సంస్థకు దక్కిందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ - ఐసీఏఆర్ పూర్వ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగళ్‌రాయ్ అన్నారు. భారత్‌లో ప్రజలకు కరోనా టీకా ఇవ్వడమే కాకుండా.. ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం అసాధారణ విషయమని కితాబు ఇచ్చారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో.. భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో.. వర్చువల్ వేదికగా ఐదు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు - 2023కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా 500 మంది పైగా శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. దేశంలో అనూహ్య వాతావరణ మార్పులు, సహజ వనరులు తగ్గిపోతున్న నేపథ్యంలో.. వంట నూనెల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపులో సవాళ్లు, కరోనా, వంటి అంశాలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనితో పాటు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా.. దిగుమతులపై ప్రభావం అనే అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
భారత్‌లో స్వయం సమృద్ధి లక్ష్యంగా: రాబోయే రోజుల్లో మలేషియా, ఇండోనేషియా నుంచి ముడి నూనెల దిగుమతులపై ఆధారపడకుండా.. భారత్‌లో స్వయం సమృద్ధి లక్ష్యంగా.. రైతుల ఆదాయాలు రెట్టింపు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలుపరచాల్సిన అంశాలు ప్రస్తావిస్తున్నారు. సాధారణంగా 70 శాతం వైరస్‌లు జన్యు పరంగా సంక్రమిస్తాయని, పశువుల నుంచి మనుషులకు సోకుతాయని తెలిపారు. నూనెగింజల పంటల సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెంచేందుకు నాణ్యమైన విత్తనం, కొత్త టెక్నాలజీ, మార్కెటింగ్ అవకాశాలు అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు.
సెకండరీ అగ్రికల్చర్ అనివార్యం: రైతుల నికర ఆదాయాలు పెరగాలంటే సెకండరీ అగ్రికల్చర్ అనివార్యం అని... అమూల్ తరహాలో వ్యూహాలు అమలు చేస్తూ సహకార రంగం బలోపేతం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎంపీ అన్నాసాహెబ్ శంకర్ జోల్లె పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ వనరులతో నిరక ఆదాయం ఇచ్చే వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, సోయాచిక్కుడు వంటి పంటలతోపాటు తేనెటీగల పెంపకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.
తద్వారా గ్లోబల్ అగ్రికల్చర్ మార్కెట్‌లో భారత్ వాటా పెరగాల్సిన అవసరం ఉందని ఎంపీ అన్నాసాహెబ్ శంకర్ జోల్లె వివరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు - ఎన్‌డీడీబీ ఛైర్మన్ మీనేష్‌సాహ్, ఐసీఏఆర్ ఏడీజీ డాక్టర్ సంజీవ్‌గుప్త, ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కే మథూర్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: ఈనెల 28న ఆదిలాబాద్‌కు అమిత్‌షా రాకా.. నియోజకవర్గాల బలోపేతమే లక్ష్యంగా