స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో డిప్యూటీ మేయర్ మహ్మద్ బాబా ఫసీయుద్దీన్, కమిషనర్ లోకేశ్ కుమార్, ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు మేయర్ పేర్కొన్నారు. నగరం గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ది పథంలో దూసుకుపోతుందని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎస్.ఆర్.డి.పి ద్వారా స్కై వేలు, ఫ్లైఓవర్లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించి.. ప్రయాణ దూరాన్ని, సమయాన్ని ఆదా చేసేందుకు అనువుగా నగర వ్యాప్తంగా స్లిప్ రోడ్లు, లింక్ రోడ్లను నిర్మించి అనుసంధానం చేసినట్లు రామ్మోహన్ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన రోడ్ల నిర్వహణను మెరుగుపర్చేందుకై సి.ఆర్.ఎం.పి ద్వారా రీ-కార్పెటింగ్, లేన్ మార్కింగ్, ఫుట్‌పాత్‌ల నిర్వహణ, గ్రీనరీ పెంపుదల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. 3 నెలల్లో అనేక ప్రాజెక్టులను పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.