ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో మంగళవారం రాత్రి రౌడీషీటర్ వెంకటేశ్‌రెడ్డి హత్యతో మద్దిలపాలెం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన వెంట ఉండే అనుచరులే అతన్ని కిరాతంగా ఇనుపరాడ్లతో కొట్టి చంపారు. వెంకటేశ్ గతంలోనూ రెండు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు కాగా.. ఎంవీపీ కాలనీ పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉంది. నక్కవానిపాలెంలో నివాసం ఉంటే వెంకటేశ్.. స్థానిక యువకులకు మాయమాటలు చెప్పి తనతో తిప్పుకునేవాడు. వారిని కొడుతూ, తిడుతూ వారిపై ఆధిపత్యం ప్రదర్శించేవాడు. దీంతో వారు అతని నుంచి విడిపోయి వేరే వర్గంగా మారారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న వెంకటేశ్‌ను బయటకు పిలిచి.. ఇనుప రాడ్లతో కొట్టి, కత్తులతో నరికి చంపారు. ఈ హత్య కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆధిపత్య పోరే హత్యకు కారణమని తేల్చారు. హత్యకు ఉపయోగించిన కత్తులు, రాడ్లు స్వాధీనం చేసుకున్నారు.
రౌడీల మధ్య ఆధిపత్య పోరు..
విశాఖలోని ఆరిలోవ ప్రాంతంలో ఇటీవల కాలంలో రౌడీల సంఖ్య భారీగా పెరిగింది. చిన్న చిన్న సెటిల్‌మెంట్లు చేయడం..భూవివాదాలు, దొంగతనాలు, కోడిపందేలు, పేకాట నిర్వహించడం, కుటుంబ తగాదాలు, గంజాయి, అక్రమ మద్యం విక్రయాల్లో వీరు పాల్గొంటున్నారు. ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములు ఆక్రమించి విక్రయించడం.. అడ్డువచ్చినవారిపై దాడులకు దిగడం ఆరిలోవ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో రౌడీల మధ్య ఆధిపత్య పోరు పెరిగింది. అక్రమంగా సంపాధించిన దానిలో వాటాల పంపకంలో విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి.
ఒక్క ఆరిలోవలోనే 41 మంది రౌడీషీటర్లు..
నగరంలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 440 మంది రౌడీలు ఉన్నారు. పలువురిపై రౌడీషీట్లు తెరిచారు. వీరి కార్యకలాపాలపై పోలీసుల నిఘా కొరవడటంతో విశాఖ నగరంలో అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ఒక్క ఆరిలోవ పోలీసు స్టేషన్ పరిధిలోనే 41 మంది రౌడీషీటర్లు ఉన్నారు. బర్మాక్యాంపు, కంచరపాలెం, అల్లిపురం, కొబ్బరితోట, మాల్కాపురం, గాజువాక, గోపాలపట్నం తదితర ప్రాంతాల్లోనూ రౌడీల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆరిలోవ ప్రాంతంలో నమోదయ్యే కేసుల సంఖ్య కూడా ఎక్కువే. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీపీ ఆరిలోవ పోలీసు స్టేషన్ కు ప్రత్యేకంగా మరో సీఐను పంపారు. అయినప్పటికీ అక్కడి పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు.
ఇవీ చూడండి: 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!