ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జంట నగరాల్లో మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య.. క్రమంగా పెరుగుతోంది. ప్రైవేటు బస్సులను తిప్పుతున్నా.. అవి సరిపోక ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. ప్రధానంగా, మెట్రో రైల్‌లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. సమ్మెతో రైళ్ల సమయాన్ని కూడా.. అధికారులు పొడిగించారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంచుతున్నారు. దసరా సెలవుల తర్వాత... నగరానికి వచ్చే వారితోఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, జేబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు జనాలతో కిటకిటలాడతున్నాయి.
810 ట్రిప్పులు..
ప్రస్తుతం రోజువారీ మెట్రో ట్రిప్పులు 710 నడుస్తున్నాయి. సమ్మె కారణంగా 100 పెంచగా... మొత్తం 810 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలో 6 నిమిషాల మెట్రో రైల్ ఫ్రీక్వెన్సీ ఉండగా.. ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే సమయాల్లో అంతకంటే తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 3 నిమిషాలకు ఒక మెట్రో రైల్ నడుపుతున్నారు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ... సైబర్ టవర్స్ వెళ్లే ఉద్యోగులు.. మెట్రో రైళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇందుకోసం అదనంగా టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు.. అధికారులు వెల్లడించారు.
నేటి నుంచి విద్యా సంస్థలు కూడా తెరుచుకుంటున్న నేపథ్యంలో మరింత ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉంది.
ఇదీ చదవండిః ప్లాస్టిక్‌ను పారదోలకుంటే... భవిష్యత్తు అంధకారమే!