Telangana New Secretariat News : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయం ఈ నెల 30వ తేదీన ప్రారంభానికి అందంగా ముస్తాబవుతోంది. అదే రోజు నుంచే అధికారికంగా కొత్త సచివాలయంలో పూర్తిస్థాయి విధులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త సచివాలయంలో విధుల నిర్వహణ, దస్త్రాల తరలింపుపై నిన్న (సోమవారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని శాఖల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి.. పలు ఆంశాలపై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 30వ తేదీ నుంచి తమ విధులను కొత్త సచివాలయంలోనే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
Telangana New Secretariat: శాఖల వారీగా గదుల కేటాయింపునకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈరోజు వెలువడే అవకాశాలున్నాయి. నూతన సచివాలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన సీఎస్.. ఫర్నీచర్, సంబంధిత సామగ్రి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇంటర్నెట్ సదుపాయం కోసం వైఫై సహా అన్నీ సమకూరుస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు నెల 26 నుంచి 29వ తేదీలోగా అన్ని శాఖలు తమకు సంబంధించిన కంప్యూటర్లు, దస్త్రాలను కొత్త సచివాలయంలోకి చేరవేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. బీఆర్‌కే భవన్‌లో విధుల నిర్వహణకు శనివారమే(29న) ఆఖరి రోజని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తరలింపు నేపథ్యంలో కొన్ని శాఖల్లో ఇప్పటికే దస్త్రాలను ప్యాకింగ్ చేసే పనిలో పడ్డారు. ఆదేశాలు అందిన వెంటనే కొత్త సచివాలయానికి తరలించేందుకు వీలుగా సిద్దమవుతున్నారు.
సీఎం చేతుల మీదుగా ప్రారంభం: కొత్త సచివాలయానికి అందరూ ఒకేమారు రాకుండా షెడ్యూల్ ఇవ్వనున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి, పోలీసు అధికారులతో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చర్చించారు. ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల సిద్ధమైంది. ఇతర పనులు కొనసాగుతున్నాయి.
Telangana New Secretariat Inauguration On April 30th: ఈ నెల 30వ తేదీన వేకువజామున 5 గంటల నుంచే నూతన సచివాలయ ప్రారంభోత్సవ పూజలు, హోమాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు ఉదయం 10 గంటల్లోగా నూతన సచివాలయ ప్రాంగణంలోని పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. మధ్యాహ్నం 1.10-1.20 గంటల మధ్యలో నూతన సచివాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రారంభం అనంతం సీఎం తన కార్యాలయంలో కొలువుదీరుతారు. అదే సమయంలో సీఎంవో కార్యదర్శులు సహా పలు శాఖల మంత్రులు, ఇతర కార్యదర్శులు తమ తమ కార్యాలయాల్లో ఆసీనులవుతారని తెలుస్తోంది.
ఇవీ చదవండి: