Illegal Sand Mining in Karimnagar : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని నేషన్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. చెక్ డ్యాముల్లో పూడిక తొలగింపు పేరుతో ఇసుక తరలించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. పెద్దపల్లి నియోజకవర్గంలో 25 ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. చెక్‌డ్యాములలో పూడిక తీత పేరుతో.. నిర్మాణం పూర్తి కాకముందే ఇసుకను తరలిస్తున్నారని, దీని వల్ల భూగర్భజలాలు అడుగంటడమే కాక.. దుమ్ము ధూళి సమస్య తలెత్తుతోందని స్థానికులు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
Karimnagar Illegal Sand Mining : తవ్వకాలు నిలిపివేయాలని ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా ఇసుక రవాణా, సామర్ధ్యానికి మించి లోడుతో లారీల రవాణా సాగుతుండటంతో ఓదెల మండలంలోని అనేక గ్రామాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. కనగర్తి, మడక, శానగొండ, పాపయ్యపల్లి, ఇందుర్తి, గుంపుల గ్రామాల్లో రహదారిపై పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గం గుండా నిత్యం రాకపోకలు నిర్వహించే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకొనే వారు లేరని గ్రామస్థులు వాపోతున్నారు.
ఓదెల మండలంలో ప్రధానంగా 8ఇసుక రీచ్ ద్వారా నిరంతరాయంగా ఇసుక రవాణా సాగుతోంది. రీచ్‌లకు అనుమతించిన అధికారులు నిబంధనల కంటే అధికంగా ఇసుక వెళ్తున్నా..కనీసం పట్టించుకొనే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేయింబవళ్లు తిరుగుతున్న ఇసుక లారీల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని పలుసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఆదాయం కోసం ప్రభుత్వం ఆలోచించినప్పుడు ప్రజలకు కలిగే ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. గుంతలు పడిన రహదారులపై ప్రయాణం నరకయాతనగా ఉందని వాపోతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, లారీ మోతకు పరిష్కారం చూపించాలని మానేరు తీర ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: