Illegal Constructions: రాష్ట్రంలో నగరపాలక సంస్థలు, పురపాలక పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. టీఎస్‌బీపాస్ చట్టంలో భాగంగా ఏర్పాటైన టాస్క్‌ఫోర్సు కమిటీలు అలంకారప్రాయంగా మారాయి. నిబంధనలకు అనుగుణంగా భవన నిర్మాణాలు జరిగేలా చూడటంతోపాటు అతిక్రమణలకు పాల్పడిన భవనాలను కూల్చివేయడం, జరిమానాలు విధించడం వంటి కీలక బాధ్యతల్ని నిర్వర్తించాల్సిన ఈ కమిటీలు హెచ్‌ఎండీఏ, మరో ఒకట్రెండు చోట్ల మినహా క్రీయాశీలంగా లేవనే విమర్శలున్నాయి. ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిశీలించి.. నిర్మాణాలు అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ నెలల క్రితమే ఉత్తర్వులు జారీ చేసినా అమల్లో ఉదాసీనతే కొనసాగుతోంది. టీఎస్‌బీపాస్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్సు కమిటీలు ఏర్పాటైనా.. నిర్మాణం పూర్తయ్యేలోపు కనీసం ఒకసారి కూడా భవనాన్ని పరిశీలించే స్థితిలో అవి లేవు. వివిధ శాఖల అధికారులతో ఉన్న ఈ బృందాలు అత్యధిక చోట్ల బాధ్యతలకు దూరంగా ఉంటున్నాయి. దీనికితోడు రాజకీయ ఒత్తిళ్లతో అక్రమ నిర్మాణాలు, అతిక్రమణలపై దృష్టిసారించాలంటేనే కొన్ని చోట్ల బెంబేలెత్తుతున్నారు. దీంతో ఎలాంటి సెట్‌బ్యాక్‌లు లేకుండానే నిర్మాణాలు చేయడం, మాస్టర్‌ప్లాన్ నిబంధనల ఉల్లంఘనలు షరా మామూలు వ్యవహారంగా తయారయ్యాయి. గతంలో పట్టణ ప్రణాళిక విభాగం భవన నిర్మాణాలను పరిశీలించేది. అవినీతి నేపథ్యంలో ఈ కీలక బాధ్యతను వివిధ శాఖల అధికారులతో ఉన్న టాస్క్‌ఫోర్సుకు పురపాలక శాఖ అప్పగించింది. అప్పటి నుంచి.. అసలు భవన నిర్మాణాలను పరిశీలించడం తమ బాధ్యత కాదన్నట్లు పురపాలక, పట్టణ ప్రణాళిక అధికారులు వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు వస్తే వాటిని టాస్క్‌ఫోర్సు కమిటీలకు పంపి చేతులు దులుపుకుంటున్నారు.
పురపాలక మంత్రి కేటీఆర్ ప్రత్యేక సమీక్ష నేపథ్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలో టాస్క్‌ఫోర్సు బృందాలు దాడులు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు అక్రమ నిర్మాణాలపై చర్యలుతీసుకున్నాయి. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించిన వరంగల్‌లాంటి ప్రాంతాల్లోటాస్క్‌ఫోర్సు కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నా, మిగిలిన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో మాత్రంకమిటీలు మొక్కుబడిగా మారాయి.
పుర ప్రజాప్రతినిధుల అడ్డుచక్రం
టాస్క్‌ఫోర్సు కమిటీలు విధులు నిర్వర్తించకుండా పురపాలక ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు అడ్డుతగులుతున్నారన్న విమర్శలుఉన్నాయి. ఉదాహరణకు.. జనగామ పురపాలికలో అక్రమ నిర్మాణాలపై తనిఖీలను కొందరు ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అని తనిఖీల జోలికిపోయేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు.
కదలని కరీంనగర్ కమిటీ
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో టాస్క్‌ఫోర్సు పూర్తి నిస్తేజంగా మారింది. అక్రమ నిర్మాణాలపై 120కి పైగా ఫిర్యాదులు వచ్చినా ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. క్షేత్ర స్థాయిలో ఫిర్యాదులను పరిశీలించిన దాఖలాలూ లేకపోవడం గమనార్హం. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక్క అక్రమ నిర్మాణాన్ని మాత్రం కూల్చారు.
భవనాలకు అనుమతి, నిర్మాణాల్లో అతిక్రమణలను నియంత్రించే ఉద్దేశంతో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని 2021 ఫిబ్రవరిలో నిర్ణయించారు. ఆ మేరకు అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, ఆర్‌అండ్‌బీ శాఖలు, పట్టణ ప్రణాళిక విభాగాలతో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటయ్యాయి. టీఎస్‌బీపాస్‌లో అనుమతి పొందిన ప్రతి భవనాన్నీ నిబంధనకు అనుగుణంగా నిర్మిస్తున్నారా? లేదా? అనేది ఈ కమిటీలు పరిశీలించాలి. అక్రమ నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులపై మూడు రోజుల్లో స్పందించాలి. ఇవేవీ జరగడం లేదు. ఉదాహరణకు నల్గొండ పురపాలక సంఘం పరిధిలో 100కు పైగా ఫిర్యాదులున్నా.. ఎలాంటి చర్యలు లేవు.
అన్ని చోట్లా అదే పరిస్థితి..
* నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో టీఎస్‌బీపాస్ ద్వారా 600కుపైగా అనుమతులు ఇచ్చినా.. టాస్క్‌ఫోర్సు మాత్రం కనీసం పరిశీలన చేయలేదు. తనిఖీలకు కొందరు నేతలు అడ్డుతగులుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.
* ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలపై ఆరు నెలలుగా ఎలాంటి చర్యలు లేవు.
* రామగుండంలో గతంలో చురుగ్గా వ్యవహరించిన టాస్క్‌ఫోర్సు కమిటీ.. గత రెండు నెలలుగా నిస్తేజంగా మారింది.
* మహబూబ్‌నగర్, గద్వాలల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపూ లేకుండా పోగా.. టాస్క్‌ఫోర్సు మాత్రం చర్యలకు దూరంగా ఉంది.
* కామారెడ్డిలో మాత్రం గతంలో టాస్క్‌ఫోర్సు కమిటీ 32 అక్రమ నిర్మాణాలను సీజ్ చేసింది.
ఇదీ చూడండి: