వ్యవసాయానికి వాతావవరణానికి విడదీయలేని సంబంధం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటేనే పంటలు పండుతాయి. లేకుంటే పంటలు సరిగా పండవు రైతులు కూడా నష్టపోతారు. రైతులకు ఉపయోగపడేందుకు... వివిధ వాతావరణ పరిస్థితుల్లో రైతులు వివిధ పంటలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అగ్రోమేట్ బులిటెన్ ను విడుదల చేస్తాయి.
2006 నుంచి సేవలు
సూపర్ కంప్యూటర్లను ఉపయోగించుకొని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాతావరణ సూచనలను దేశమంతటా ఇస్తుంది. 2006 నుంచి వాతావరణ ఆధారిత ఇతర సర్వీసులను ప్రారంభించారు. ఇందులో వ్యవసాయదారులకు వాతావరణ ఆధారిత సూచనలు చెప్తారు. ప్రతి జిల్లాకు ఐదు రోజులకొకసారి బులిటెన్ విడుదల చేస్తారు.
సులభతరం
కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వర్షపాత సూచన, తేమ, గాలి తీరు వంటివి ఇందులో ఉంటాయి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని వేల సంఖ్యలో ఉన్న బ్లాక్ స్థాయి బులిటెన్ తయారు చేయటం ఇంకా క్లిష్టమైంది. డేటా సైన్స్, ఏఐ తదితర సాంకేతిక విషయంలో పరిశోధనలు చేసే ఐఐఐటీ పరిశోధకులు ఈ ప్రక్రియను సులభతరం చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాయంతో ఈ పరిశోధన చేపట్టాం. ఐటీని ఉపయోగించి అగ్రోమేట్ బులిటెన్ తయారు చేసే సమయాన్ని కుదించటంపై పరిశోధనలు మొదలుపెట్టాం. ఐదేళ్ల నుంచి బ్లాక్ లెవల్ అగ్రోమేట్ బులిటెన్ వివరాలను తీసుకున్నాం. బులిటెన్ తయారీ సమయాన్ని తగ్గించేందుకు డాటాను తిరిగి ఉపయోగించటంపై పరిశోధన చేశాం. రెండు బ్లాకుల్లో వాతావరణం సమానంగా ఉన్నప్పుడు .. బులిటెన్ సమానంగా ఉంటుందని గుర్తించాం.
-క్రిష్ణా రెడ్డి, ఐటీ ఫర్ అగ్రికల్చర్ అండ్ డెవలప్మెంట్ సెంటర్
ఇతర రంగాలకూ..
రాష్ట్రంలో 20 బ్లాకులకు సంబంధించిన వాతావరణ సూచనలను తీసుకొని... విశ్లేషణ చేశామన్నారు. 80 నుంచి 90 శాతం సమానంగా ఉన్నాయని తెలిపారు. ప్రతిసారీ కేవలం 10 నుంచి 15 శాతం బులిటెన్ మార్చుకుంటే సరిపోతుందని చెప్పారు. ఈ వ్యవస్థను ఇతర రంగాలకూ ఉపయోగించుకోవచ్చని వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు