ఉస్మానియా విశ్వవిద్యాలయం భూమిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని.. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. నకిలీ పత్రాల ఆధారంగా కొందరు నిర్మాణ అనుమతులకు ప్రయత్నిస్తున్నారని, వారికి అనుమతులు ఇవ్వొద్దని, ఓయూను కబ్జాదారుల నుంచి కాపాడాలని రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, వీసీ ఓఎస్డీ కృష్ణారావు... జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌కు లేఖ ఇచ్చారు.
సుప్రీంకోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్ ఓయూ పరిధిలోని డిడి కాలనీలో తులసి కోపరేటింగ్ హోసింగ్ సోసైటీకి ఉస్మానియా యూనివర్సిటీకి మధ్య ఏర్పడిన స్థలం వివాదంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం 4800 చదరపు గజాల స్థలాన్ని ఆ సొసైటీకి ఇచ్చినట్లు తెలిపారు. తదనుగుణంగా 4800 చ.గ. భూమిని సొసైటీ వారు లే అవుట్ చేసి 13 మందికి విక్రయిoచారు.
కుట్ర పూరితంగా తప్పుడు పత్రాలు
ప్రస్తుతం ఆ స్థలాల్లో భవనాలు కట్టుకొని పలువురు నివసిస్తున్నారు. ఒక ప్లాట్ ను పార్కు కు కేటాయించారు. అయితే మరో 9 మంది అదే సోసైటీతో కుట్ర పూరితంగా తప్పుడు పత్రాలు, విక్రయ పత్రాలను సృష్టించి.. మరో 3,296 చ.గ. స్థలాన్ని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని మేయర్ కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు.
సర్వేకు డిమాండ్
ఓయూ భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. క్యాంపస్ చుట్టూ ప్రహరీ నిర్మించాలన్నారు. ఈ మేరకు ఓయూలో ఏబీవీపీ, ఐక్య విద్యార్థి, ఉద్యోగ, వామపక్ష, నిరుద్యోగ విద్యార్థి సంఘాల నేతలు వేర్వేరుగా నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: గిరాకీకే ప్రాధాన్యం