ఇక్రిశాట్(ICRISAT LATEST) ఆధ్వర్యంలో మూడు కొత్త శనగ పంట వంగడాలు విడుదలయ్యాయి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు సమర్థవంతంగా తట్టుకుని అధిక దిగుబడలు ఇచ్చే ఈ ఐపీసీఎల్-4, బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3 శనగ వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్రిశాట్(ICRISAT LATEST) సహకారంతో కాన్పూర్‌లోని ఐసీఏఆర్, భారతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థ- ఐఐపీఆర్, న్యూదిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ- ఐఏఆర్‌ఐ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ శనగ వంగడాలైన బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3 రకాలను సెప్టెంబరు 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. అదే రోజు ఈ రెండు రకాలు సహా వివిధ పంటలకు సంబంధించి మొత్తం 35 వంగడాలు విడుదల చేసి జాతికి అంకితం చేయడం విశేషం.
అధిక దిగుబడులు
అనేక సంవత్సరాలుగా నీటి పారుదల కింద చాలా ప్రదేశాల్లో మూల్యాంకనం చేసిన తర్వాత ఈ కొత్త రకాలు సగటు దిగుబడి కంటే 14.76 శాతం, 11.9 శాతం అధిక దిగుబడి ప్రయోజనం పొందవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధరించారు. ఈ రకాలు పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో సాగుకు యోగ్యమని తేల్చారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంట అభివృద్ధి, జర్మ్‌ప్లాజంలో వైవిధ్యం తెలియజేస్తుంది. కరవు పరిస్థితుల్లో 60 శాతం నష్టాలు అధిగమించవచ్చు. అనూహ్యంగా మారుతున్న వాతావరణానికి అనుగుణంగా పంట దిగుబడులు పెంచడానికి జెనోమిక్స్ ఆధారిత జోక్యం, బయోటిక్, అబియోటిక్ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం అత్యంత అవసరం.
రైతులకు మేలు
ఇక్రిశాట్(ICRISAT LATEST) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన శనగ వంగడాల రూపకల్పనలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఐసీఏఆర్, ఇక్రిశాట్ సహకార కృషి రైతులకు మేలు చేయడం సంతోషంగా ఉందని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూస్ అన్నారు. కీలక వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పుల సవాళ్లకు అనుగుణంగా మెకానిజమ్‌లు అందించడం ద్వారా ఆహార భద్రత, పోషకాహార భద్రత అందించడంతో పాటు రైతుల జీవనోపాధి బలోపేతం చేయడానికి ఈ కొత్త రకాలు సిద్ధంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
కార్యాచరణ
అధిక దిగుబడులు ఇచ్చే ఈ కొత్త శనగ వంగడాలు దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇక్రిశాట్, ఐసీఏఆర్ సన్నద్ధమయ్యాయి. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంచేందుకు కృషి చేస్తోంది. అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రకాల రూపకల్పనలో ఇక్రిశాట్ జెనోమిక్స్ సంస్థ అధిపతి డాక్టర్ రాజీవ్ కె. వర్షిణి అత్యంత కీలకంగా వ్యవహరించడం విశేషం. ఆయన పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ వంగడాలు రైతుల స్థాయిలో తీసుకెళ్లడం ద్వారా వారికి దిగుబడుల విషయంలో ఓ పూచీకత్తు ఇస్తున్నారు. ఫాస్ట్- ఫార్వర్డ్ బ్రీడింగ్ విస్తరణకు పిలుపునిస్తూ రైతులకు వేగంగా పంపిణీ చేయాలని ఇక్రిశాట్ కార్యాచరణ రూపొందించింది.
శనగ వంగడాలు అభివృద్ధి చేసే క్రమంలో 2019, 2020లో విడుదలైన ౩ రకాలు, తాజాగా విడుదలైన ఈ ౩ రకాలు మొత్తం 6 రకాలు విడుదల చేసినట్లు ఇక్రిశాట్ జెనోమిక్స్ సంస్థ అధిపతి డాక్టర్ రాజీవ్ కె వర్షిణి "ఈటీవీ, ఈటీవీ-భారత్" ప్రతినిధితో చెప్పారు. గత మూడేళ్ల కాలంలో చక్కటి పురోభివృద్ధి సాధించిన దృష్ట్యా... తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్‌లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఈ శనగ పంట వంగడాలు వేసుకుని లాభాలు పొందాలని ఆయన సూచించారు.
ఈ కొత్త రకాల వంగడాల ప్రత్యేకతలు (GRFX)
శనగ వంగడం రకం | 100 విత్తనాల బరువు | పంట కాలం | సగటు దిగుబడి | జోన్ |
(గ్రాములు) | (రోజులు) | (హెక్టారుకు కిలోలు) | ||
ఐపీసీఎల్-4 | 16.6 | 128-133 | 1500-1600 | నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్ |
బీజీఎం 4005 | 22.04 | 131 | 1600-1700 | నార్త్ వెస్ట్ ప్లెయిన్ జోన్ |
ఐపీసీఎంబీ 19-3 | 24.1 | 106 | 2000-2100 | సెంట్రల్ జోన్ |
ఇదీ చదవండి: Eetela Rajender Interview: ఎంత మభ్యపెట్టినా గెలిచేది నేనే: ఈటల