IAS Transfers in Telangana: రాష్ట్రంలో త్వరలోనే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే డీజీ స్థాయి సహా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం... కొందరు ఐఏఎస్‌లకు పదోన్నతులు కూడా కల్పించింది. మరికొందరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు కొనసాగింపుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు త్వరలోనే జరగనున్నాయి. వాస్తవానికి ఐఏఎస్ అధికారుల బదిలీల అంశం ఇప్పటికే పలుమార్లు తెరపైకి వచ్చింది.
నవంబర్ చివరి వారంలోనూ ఐఏఎస్‌ల బదిలీలపై జోరుగా చర్చలు జరిగాయి. సీఎం కేసీఆర్ కూడా ఐఏఎస్ అధికారుల బదిలీ విషయమై 2రోజులపాటు కొంతమంది మంత్రులతో కలిసి కసరత్తు చేశారు. అయితే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లను బదిలీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఐఏఎస్‌ల బదిలీలు వాయిదాపడ్డాయి. ఓటర్ జాబితా సవరణ తుదిజాబితాను ఈసీ ఇవాళ ప్రకటించనుంది. దీంతో కలెక్టర్ల బదిలీకి అడ్డంకి తొలగిపోయింది.
పలు జిల్లాలో కలెక్టర్లు రెండేళ్లకు పైబడి పనిచేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శాసనసభ ఎన్నికల నాటికి అటువంటి వారిని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ తదితర జిల్లాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్లు కొనసాగుతున్నారు. వారిస్థానంలో పూర్తి స్థాయి కలెక్టర్లతోపాటు ఇతర చోట్ల కూడా మార్పులు ఉంటాయనే సమాచారం అందుతోంది.
ఉన్నతాధికారుల బదిలీలు కూడా భారీగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కార్యదర్శి స్థాయి వరకు మెజార్టీ అధికారులకు స్థానభ్రంశం కలగవచ్చనే చర్చ జరుగుతోంది. కొందరు అధికారులకు ఉన్న అదనపు బాధ్యతలను ఇతరులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కార్యక్రమాల అమలు పూర్తిస్థాయిలో పర్యవేక్షించేలా బదిలీలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఐఏఏస్‌ల బదిలీ ఉత్తర్వులు... త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఇవీ చదవండి: