Hyderabad to Ayodhya Trains : శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఏర్పాట్లు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రపంచ నలుమూలల నుంచి సీతారాములకు బహుమతులు అందుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్టకు ఇప్పటికే శుభ ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రాణప్రతిష్ట ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రముఖ క్రీడాకారులు, సినీ తారలు, ఆధ్యాత్మిక నాయకులు, వ్యాపారవేత్తలు, సాధువులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
Hyderabad People are Preparing to Go to Ayodhya : మరోవైపు ఈ నెల 22న జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం భక్తులకు పండగలా మారింది. ఆ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భాగ్యనగరం నుంచే వేలాది మంది అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వారంలో రెండు రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యశ్వంత్‌పూర్‌లో బయల్దేరి కాచిగూడ, సికింద్రాబాద్ మీదుగా వెళ్లే వీటిలో ఇప్పటికే సీట్లు ఫుల్ అయ్యాయి. దీంతో ప్రయాణ సన్నాహాల్లో ఉన్నవారు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అయోధ్య అరుదైన ఘనత- అతిపెద్ద 'సోలార్ స్ట్రీట్'తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్
ప్రతి రోజూ నడపండి : సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నేరుగా అయోధ్య వెళ్లేందుకు సుమారు 30 గంటల సమయం పడుతుంది. తొలుత వారణాసి వెళ్లి అక్కడి నుంచి మరో రైలులో అయోధ్యకు చేరే అవకాశం ఉన్నప్పటికీ అదనంగా 6 గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. తిరుగి ప్రయాణానికీ మరో మార్గం లేని పరిస్థితి. ఫలితంగా అదనపు ఖర్చుతో పాటు సుమారు 36 గంటల ప్రయాణం చేయాలి.
ప్రతి రోజు సికింద్రాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు రైలును అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో నెల రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయోధ్యకు విమాన సర్వీసులు ఉన్నప్పటికీ, టిక్కెట్ ధర సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి. ఎయిర్‌లైన్స్‌ను బట్టి ధర రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. విమానంలో హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లి రావాలంటే ప్రయాణానికే ఒక్కొక్కరికి సగటున రూ.30 వేలు వరకు ఖర్చవుతుంది.
గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ : యశ్వంత్‌పూర్ నుంచి అయోధ్య మీదుగా వెళ్లే గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(15024) ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు వస్తుంది. అలాగే శనివారం సాయంత్రం 3:30కు అయోధ్య చేరుకుంటుంది. కనీసం నెల ముందైన రిజర్వేషన్ చేసుకొంటేనే టిక్కెట్లు దొరికే ఛాన్స్ ఉంది.
గోరఖ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ : యశ్వంత్‌పూర్ నుంచి మన్‌కాపూర్ మీదుగా వెళ్లే గోరఖ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12592) ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది. బుధవారం(మరుసటి రోజు) మధ్యాహ్నం 1 గంటకు మన్‌కాపూర్ చేరుకుంటుంది. కాగా మన్‌కాపూర్ నుంచి అయోధ్యకు 45 నిమిషాలు పడుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య అనేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.
25 సెకన్లలో రాముడి విగ్రహంతో గర్భగుడికి మోదీ- అద్భుత ముహూర్తంలోనే ప్రాణప్రతిష్ఠ
'లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం'-రామమందిర నిర్మాణంపై అడ్వాణీ