రేపటి నుంచి నిర్వహించనున్న ఆరో విడత హరితహారానికి హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హరితహారం ఏర్పాట్లను బయోడైవర్సిటీ విభాగం అదనపు కమిషనర్ కృష్ణలతో కలిసి జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన విజయ నర్సరీని మేయర్ రామ్మోహన్ సందర్శించారు. నర్సరీలో వివిధ బ్లాక్‌లుగా పెంచుతున్న 3 లక్షల మొక్కలను పరిశీలించారు. హైదరాబాద్‌ను హరితనగరంగా చేయుటలో సహకరించాలని ప్రజలకు మేయర్ విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌ను కాలుష్యరహిత నగరంగా మార్చుటకు హరితహారం ఈ ఏడాది 2 కోట్ల 50 లక్షలు మొక్కలు నాటాలని సీఎం లక్ష్యంగా నిర్దేశించారు. నగరంలోని 150 వార్డుల్లో వార్డు స్థాయి హరిత ప్రణాళికను రూపొందించాం. హరితహారంలో కార్పొరేటర్లు, డిప్యూటీ కమిషనర్లు కీలకపాత్ర పోషించాలి. హరితహారంలో కాలనీ అసోసియేషన్లు, సంక్షేమ సంఘాలను భాగస్వాములను చేస్తున్నాం. ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తాం. ప్రతి కాలనీలో అవెన్యూ ప్లాంటేషన్ చేపడుతున్నాం. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు అందించాలని దాతలకు విజ్ఞప్తి చేస్తున్నా.
-బొంతు రామ్మోహన్ , జీహెచ్‌ఎంసీ మేయర్
మొక్కలు సిద్ధంగా ఉన్నాయి
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తోన్న బ్లాకుల్లో మొక్కలు నాటించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హరితహారంలో భాగంగా 50 థీమ్ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 700 ట్రీ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 29 నర్సరీల్లో 50 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మిగిలిన మొక్కలను హెచ్ఎండీఎ నర్సరీలు, ప్రైవేటు నర్సరీల నుంచి సేకరించనున్నట్లు తెలిపారు.
మూడు అర్బన్ పార్కులు
ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ప్రకారం యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కింద కూకట్‌పల్లి జోన్ బోరంపేట, రామారం, సూరారం రిజర్వ్ పారెస్ట్ క్లస్టర్‌లో ఉన్న 455 ఎకరాల 54 సెంట్ల విస్తీర్ణంలో 11,70,948 మొక్కలు నాటనున్నారు. ఎల్బీనగర్ జోన్ నాదర్‌గుల్ రిజర్వ్ పారెస్ట్ క్లస్టర్‌లో ఉన్న 42 ఎకరాల 90 సెంట్ల విస్తీర్ణంలో 5 లక్షల మొక్కలు, చార్మినార్ జోన్ మాదన్నగూడ రిజర్వ్ పారెస్ట్ బ్లాక్‌లో ఉన్న 97 ఎకరాల 12 సెంట్ల విస్తీర్ణంలో 2 లక్షల 50 వేల మొక్కలను నాటనున్నారు. ఈ మూడు బ్లాక్ లను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేసేందుకు మొత్తం 19,20,948 మొక్కలు నాటనున్నట్లు మేయర్ వివరించారు.
ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్