Hyderabad Police issues notices in data theft case: దేశవ్యాప్తంగా కలకలం రేపిన 66.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చౌర్యం కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 11 ప్రైవేటు సంస్థలు, బ్యాంకులకు నోటీసులు పంపిన పోలీసులు.. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ సంస్థలను ఆదేశించారు. ఫోన్‌పే, బిగ్ బాస్కెట్, పాలసీ బజార్, క్లబ్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆస్ట్యూట్ గ్రూపు, టెక్ మహీంద్ర తదితర సంస్థలకు తాఖీదులు పంపారు.
ఆ సంస్థల్లోని కోట్ల మంది డేటా ఎలా చౌర్యం అయింది.. భద్రతా వైఫల్యం ఎలా జరిగింది? సంస్థల్లో పని చేసే ఉద్యోగులే డేటా విక్రయించారా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పలు రకాల సేవల కోసం సంప్రదించిన ఖాతాదారులు, వినియోగదారుల డేటా చౌర్యానికి సంబంధించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయా సంస్థల సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
డేటా కొనుగోలు చేసిన వారిపైనా పోలీసులు దృష్టి సారించారు. పౌరులకు చెందిన రహస్య, వ్యక్తిగత సమాచారాన్ని కొనుగోలు లేదా అమ్మడం చట్ట ప్రకారం నేరం అవుతుంది. డేటాను వారు ఎందుకోసం కొనుగోలు చేశారు. ఏ అవసరాల కోసం వాడుతున్నారు. ఎవరెవరికి విక్రయించారు. ఆర్మీలో పని చేసే వారి సమాచారం కూడా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారా.. తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కేసులో ప్రధాన నిందితుడు హరియాణాకు చెందిన వినయ్ భరద్వాజ్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న రెండు చరవాణులు, ల్యాప్‌టాప్‌లోని డేటా, బ్యాంకు లావాదేవీలు పరిశీలిస్తున్నారు. భరద్వాజ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఏ విధంగా డేటాను సేకరించాడు.. ఎవరెవరికి విక్రయించాడు.. వంటి మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ప్రధానంగా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల్లో ఖాతాదారుల సమాచార భద్రతకు సంబంధించి లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కింది స్థాయి సిబ్బంది ఖాతాదారుల సమాచారాన్ని సునాయాసంగా తీసుకోవచ్చని తెలిపారు. పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు ఖాతాదారుల సమాచారం చౌర్యం కావడానికి ఆదే కారణమని చెబుతున్నారు. ఈ కేసులో దాదాపు 98 లక్షల మంది క్రెడిట్ కార్డులు, 8.1 లక్షల మంది డెబిట్ కార్డుదారుల సమాచారం చౌర్యం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: