అనూహ్య సంఘటనలు.. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితులు.. చరవాణి, పర్సులను పోగుట్టుకున్నవారు.. దొంగల బారిన పడిన వారికి సాయమందించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘సేవ్ అవర్ సోల్’ పేరుతో అత్యవసర సహాయ కేంద్రాలను ప్రారంభించారు. రాజుల కాలంలో ఏర్పాటు చేసిన గంట స్తంభం తరహాలో వీటిని రూపొందించారు. ఈ సహాయ వాణి ఎలాంటి సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా పని చేస్తుంది. మీట నొక్కి సమస్య చెబితే సమీపంలో ఉండే పోలీసులు క్షణాల్లో వచ్చేస్తారు.
ఇలా పని చేస్తుంది...
- పర్యాటకులు, ఊరికి కొత్తగా వచ్చిన వారు అనుకోకుండా ఆపదలో చిక్కుకుంటే ఎస్.ఒ.ఎస్.(సేవ్ అవర్ సోల్) మీట నొక్కితే చాలు.. ఈ స్తంభానికి పైనున్న కెమెరా పని చేస్తుంది.
- సేవ్ అవర్ సోల్ అన్న మీటను నొక్కిన వెంటనే పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సామాజిక మాధ్యమాల విభాగం పోలీసులు అప్రమత్తమవుతారు.
- అంతర్జాలం ద్వారా మీట నొక్కినప్పుడు బాధితురాలున్న ప్రాంతాన్ని గుర్తిస్తారు.
- కమాండ్ కంట్రోల్, స్థానిక పోలీస్ ఠాణా పోలీసులకు సమాచారం ఇస్తారు.
- పోలీసులు గుర్తించిన చోట బాధితులు లేకపోతే చుట్టుపక్కల విచారిస్తారు. స్తంభంపైనున్న కెమెరా తీసిన ఫొటోల ఆధారంగా బాధితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తారు.
- వెంటనే వాహనాన్ని పట్టుకునేందుకు నలువైపుల నుంచి ముట్టడిస్తారు.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
కేబీఆర్ పార్క్, పీవీఎన్‌ఆర్ మార్గ్ సహా కొన్నిచోట్ల ఇవి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం సాంకేతికంగా ఎదురవుతున్న స్వల్ప సమస్యలను తొలగించి నగరంలో మరిన్నిచోట్ల వీటిని అందుబాటులోకి తేనున్నారు.
ఇదీ చూడండి: సాయుధుల దాడి- 73 మంది విద్యార్థుల కిడ్నాప్!