కరోనా వైరస్ సోకకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా... కొత్తకొత్త వాహకాల ద్వారా వైరస్ వారిని అంటుకుంటోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో పోలీసులు కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. మరికొంత మంది పోలీసులు, అధికారులు ఈ జాబితాలో చేరుతున్నారు. వీరికి కరోనా వైరస్ ఎందుకు వస్తోందో తెలుసుకునేందుకు వివరాలు సేకరించగా... బందోబస్తు విధులు, కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో పని చేయడంతో పాటు వైరస్ సోకిన వారు వినియోగిస్తున్న చరవాణి నుంచి, కార్యాలయాల్లో కలిసి భోజనం చేయడం ద్వారా వచ్చినట్లు గుర్తించారు.
సెల్‌ఫోన్ తెరిచి..
చరవాణిలో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ సోకిందని పోలీసులు తెలిపారు. పశ్చిమ మండలంలోని ఓ పోలీస్ ఠాణాలో నమోదైన కేసులో ఆధారాల సేకరణకు చరవాణిలో ఉన్న వివరాలు కీలకమయ్యాయి. దీంతో చరవాణిలో వివరాలను తెలుసుకునేందుకు ఆ పోలీసు ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ చరవాణిని తీసుకుని ఆరు రోజుల క్రితం నేర పరిశోధన విభాగానికి వచ్చాడు. ఒక పోలీస్ అధికారిని కలవగా... ఇద్దరూ కలిసి చరవాణి తెరిచి అందులో వివరాలను సేకరించారు. ఈ పని చేసేందుకు రెండు గంటలు ఇద్దరూ ఒకేచోట ఉన్నారు. చరవాణిని పలుమార్లు తాకారు. రెండు రోజుల తర్వాత ఆ చరవాణి తెచ్చిన కానిస్టేబుల్‌కు అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోగా వైరస్ నిర్ధారణ అయ్యింది. మరో రెండు రోజులకు పోలీస్ అధికారి పరీక్షలు చేయించుకోగా... ఆయనకూ వైరస్ వచ్చిందని తేలింది
కలిసి మెలసి..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, నేర పరిశోధన విభాగం, కంట్రోల్ రూం, సైబర్ క్రైమ్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో కొందరు మధ్యాహ్నం భోజనాన్ని కలిసి తింటున్నారు. ఎనిమిది మంది నుంచి పది మంది వరకూ ఒకే గది లేదా సమావేశ మందిరంలో కూర్చుంటున్నారు. నీళ్ల గ్లాసులు, సీసాలు తీసుకోవడం, ఒకరు తెచ్చిన ఆహారాన్ని మరొకరు తీసుకోవడం వంటివి చేస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకున్నామన్న ధైర్యంతో వీరంతా రోజూ ఇలా కలిసి భోంచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఒక కానిస్టేబుల్ ద్వారా మరో కానిస్టేబుల్‌కు సోకగా.. వారం రోజుల క్రితం ఒక పోలీస్ అధికారికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది.
సైబర్ క్రైమ్స్ ఠాణాలో ఒకరికి....
సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న ఒక పోలీసు అధికారికి కరోనా వైరస్ సోకింది. నాలుగు రోజుల నుంచి ఆయన అస్వస్థతగా ఉండడంతో ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇద్దరు కుటుంబ సభ్యులకు అనుమానిత లక్షణాలు ఉండడంతో వారికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనతోపాటు కలిసి తిరిగిన పోలీస్‌కు లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.
ఇదీ చదవండి: మహానగరంలో కరోనా మహమ్మారి విజృంభణ..!