హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు వాహనాల రద్దీని ప్రత్యక్షంగా చూస్తున్నారు. పదుల సంఖ్యలో వాహనాలు వస్తున్న కూడళ్లు, ప్రాంతాల వివరాలను ట్రాఫిక్ పోలీసులకు తెలిపి అక్కడ తనిఖీలు నిర్వహించాలంటూ సూచిస్తున్నారు.
లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. పది పదిహేను రోజుల నుంచి వందల సంఖ్యలో వాహనదారులు వస్తున్న ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించి కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇలా చేయడం వల్లే మూడు రోజులుగా కేసులు తగ్గుతున్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. శుక్రవారం 17,608, శనివారం 15,881, ఆదివారం 12,123 కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనమని వివరించారు.
చెక్‌పోస్టులు.. తనిఖీలు..
లాక్‌డౌన్ సమయంలోనూ 3 కిలోమీటర్ల లోపు వరకు వెళ్లే వెసులుబాటును 40 శాతం మంది వాహనదారులు దుర్వినియోగం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు గ్రహించారు. ఒక బైక్‌పై ఇద్దరు, యువకులైతే ముగ్గురు ప్రయాణిస్తున్నారు. కారులో ఇద్దరు మాత్రమే వెళ్లాల్సి ఉండగా నలుగురైదుగురు వెళ్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నా... వాహనదారులు ఖాతరు చేయకుండా వెళ్తుండడం వల్ల ట్రాఫిక్ పోలీసులు 113 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి చెక్‌పోస్టు వద్ద ఎస్సైలు, కానిస్టేబుళ్లను తాత్కాలికంగా నియమించి తనిఖీలు చేయాలంటూ ఆదేశిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న కొందరు వాహనదారులు ప్రధాన రహదారులపై కాకుండా అనుసంధాన రహదారుల్లో వెళ్తున్నారు.
సీసీ కెమెరాల ద్వారా ఈ ఉల్లంఘనలను గుర్తించి పోలీస్ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక తనిఖీ బృందాలు అక్కడికి వస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నాయి. వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నాయి.
![who are not follow traffic rules Hyderabad traffic police give serious punishment latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6983390_988_6983390_1588138153192.png)