బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన గల్ఫ్ బాధితుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్న ఊర్లో ఉపాధి లేక... కుటుంబ పోషణకు అప్పు చేసి ఇతర దేశాలకు వెళ్లినా... వారిని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దుబాయ్లో ఉద్యోగాలకు సంబంధించిన కనీస నిబంధనలపై అవగాహన లేక ఏజెంట్లను నమ్మి మోసపోతున్నారు.
రూ. 2 లక్షలు వసూలు
ఏజెంట్లు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ మాయ మాటలు చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు. వీరిని పర్యాటక వీసాపై పంపించి చేతులు దులుపుకుంటున్నారు. అక్కడి బ్రోకర్లు పది రోజుల పాటు పని కల్పించి ఆ తర్వాత చేతులెత్తేశారు. చేసేది లేక కొంతమంది తిరుగప్రయాణమైతే... మరి కొందరు అక్కడే దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. మోసగాళ్లను నమ్మి విదేశాలకు వెళ్లొద్దని గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షుడు బసంత్ రెడ్డి తెలిపారు.
నరేందర్ రెడ్డి దీనగాథ...
హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన నరేందర్ రెడ్డి ఐటీఐ ఎలక్ట్రీషియన్ పూర్తి చేసి షార్జా వెళ్లాడు. అక్కడ ఆరేళ్ల పాటు పనిచేసి... వీసా గడువు ముగిసిన తర్వాత నగరానికి తిరిగొచ్చాడు. అక్కడే పరిచయమైన ఇబ్రహీంఖాన్... ఏజెంట్గా వ్యవహరిస్తున్నానని చెప్పి నరేందర్ నుంచి విడతల వారీగా లక్షన్నర వసూలు చేశాడు. అలాగే రాములు, ముఖేష్ నుంచి కూడా రూ. 2 లక్షలు తీసుకున్నాడు. ఇబ్రహీంఖాన్ వీరిని పర్యాటక వీసాపై దుబాయ్ పంపించాడు. గడువు ముగిసిన అనంతరం బాధితులు ఇబ్బందులెదుర్కొని తెలిసిన వారి సహాయంతో నగరానికి చేరుకున్నారు. రాములు మాత్రం డబ్బుల్లేక అక్కడే ఉండిపోయాడు. ఏజెంట్ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోతున్నాడు.
పర్యాటక వీసాలతో దుబాయ్ వెళ్లి మోసపోయిన బాధితులు ఎందరో అక్కడ దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పోలీసులు స్పందించి అక్రమ ఏజెంట్ల ఆట కట్టించాలని బాధితులు కోరుతున్నారు. తమ వద్ద నుంచి వసూలు చేసిన డబ్బును తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి : ఆ మాయావృక్షం ఎదుట సురీడూ చిన్నబోవాల్సిందే!