కరోనా ధాటికి అన్ని రంగాలు స్తంభించాయి. జీహెచ్‌ఎంసీ పరిస్థితి ఇందుకు భిన్నం. టర్మ్‌లోన్ల రూపంలో సమకూర్చుకున్న రూ.2,500 కోట్లు ఉండడం, ఐదేళ్లపాటు ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వంటి కార్యక్రమాలు బల్దియాకు కలిసొచ్చాయి. ఎస్‌ఆర్‌డీపీ పథకం కింద మూడు నెలల్లో పలు పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తిచేయగలిగింది. 9 నెలలపాటు జరగాల్సిన అభివృద్ధి పనులను మూడు నెలల్లోనే పూర్తి చేయగలిగారు.
కేటీఆర్ వ్యూహం
ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుపై బల్దియా తొలుత తన సొంత ఖాతా నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసింది. అనంతరం మూడు దఫాలుగా బాండ్ల జారీతో రూ.495 కోట్లు సమీకరించింది. అవి ఖర్చయ్యాక గత డిసెంబరులో 8.65శాతం వార్షిక వడ్డీతో రూ.2,500 కోట్ల టర్మ్‌లోన్ తీసుకుంది. అవే బల్దియాను లాక్‌డౌన్ సమయంలో ముందుకు నడిపించాయి. రూ.620 కోట్లు ఖర్చు చేసి రెండు పైవంతెనలు, ఓ అండర్‌పాస్‌ను ఇంజినీర్లు అందుబాటులోకి తెచ్చారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. షేక్‌పేట రోడ్డు, బైరామల్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45, ఇతరత్రా పైవంతెనల నిర్మాణ పనులను పరుగులు తీయించారు. మంత్రి కేటీఆర్ వ్యూహం సైతం దోహదపడింది.
లాక్‌డౌన్ మొదలవగానే గుత్తేదారులను, ఇంజినీర్లను మంత్రి సమావేశపరిచారు. వాహనాలు తిరగని రహదారులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సూచనలు చేశారు. స్వస్థలాలకు వెళ్లిపోయేందుకు సిద్ధపడిన కార్మికులకు భరోసా ఇచ్చి ప్రాజెక్టుల పనులు నిర్విరామంగా జరిగేలా చూశారు. సిమెంటు, ఉక్కు సరఫరాకు అడ్డంకులు లేకుండా చేశారు.
మెరుపు వేగంతో రోడ్లు
నగర రహదారులు 24గంటలూ రద్దీగా ఉంటాయి. ఫలితంగా నిర్మాణ పనులు సవ్యంగా సాగేవికాదు. కిలోమీటరు మార్గం వేయాలంటే ఒక రోజంతా పట్టేది. తారు పోసిన 15 నిమిషాల్లో వాహనాలను అనుమతించే పరిస్థితి ఉండడం వల్ల నాణ్యత సైతం దెబ్బతినేది. లాక్‌డౌన్ కాలంలో ఆ సమస్యలేవీ లేవు. గతేడాది ఆఖర్లో ప్రధాన రోడ్ల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు వెళ్లడంతో.. ఆయా గుత్తేదారులు మార్చి 25 నుంచి పనుల్లో వేగం పెంచారు. మొత్తంగా రూ.350కోట్లు ఖర్చు చేసినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.
ఆస్తి పన్ను వసూలులో రూ.2కోట్ల పెరుగుదల
ఆస్తిపన్ను వసూళ్లపై లాక్‌డౌన్ ప్రభావం కనిపించలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గతంకన్నా రూ.2కోట్లు అధికంగా వసూలైంది. ప్రభుత్వం సైతం ఫిబ్రవరి నుంచి ప్రతి నెల బల్దియాకు రూ.78కోట్ల నిధులు విడుదల చేస్తుండటంతో ఖజానా కష్టాలు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్, మేలో నిర్మాణ అనుమతుల జారీ నిలిచిపోవడంతో.. ఆ విభాగం ఆదాయం తగ్గింది. గతయేడాదితో పోలిస్తే జూన్ నాటికి ప్రణాళిక విభాగం ఆదాయం రూ.100కోట్లు తక్కువ ఉందని యంత్రాంగం వివరించింది.
ఇదీ చదవండి: కరోనా టెస్టులు, చికిత్సల ధరలను ప్రకటించిన ప్రభుత్వం