Drainage burst in Jubilee Hills: పేరుకుపోయిన చెత్తకుప్పలు.. ఈగలు, దోమలతో నిండిన పరిసరాలు.. రోడ్లపై మురికి నీరు ప్రవాహం.. డ్రైనేజీ నుంచి వచ్చే నీటితో దుర్గంధం.. ఇదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 40లో దుస్థితి. ఈ కాలనీలో నిత్యం మురుగు నీరు ఏరులై పారుతుండడంతో స్థానికులు ముక్కు మూసుకుని నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డ్రైనేజీ లీక్ అవుతుండడంతో.. దుర్గంధంతో అక్కడ నివసించేవారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇళ్లల్లో ఉండే గృహిణులు, ఉద్యోగులు, విద్యార్థులు.. రోడ్డు పైకి రావాలంటే భయపడుతున్నారు. నివాసాల్లోకి వాసన వస్తుండడంతో కిటికీలు, తలుపులు మూసుకోవాల్సి పరిస్థితి ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో అనేకమంది ప్రజాప్రతినిధులున్నారని.. సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
కొద్ది రోజులుగా ఈ సమస్య ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని జూబ్లీహిల్స్ జలమండలి విభాగం మేనేజర్ శ్రీహరి తెలిపారు. రోడ్డు కింద డ్రైనేజ్ పైప్ లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య ఏర్పడినట్లు చెప్పారు. పగిలిపోయిన డ్రైనేజ్ పైప్ లైన్‌ను తొలగించి దాని స్థానంలో మరో కొత్త పైప్‌ను ఏర్పాటు చేశామన్నారు. దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నట్లు.. ఒకటి, రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: