ఎయిర్‌టెక్ యంత్రాలను సమర్థంగా వినియోగించుకోకపోవడం వల్ల తాజాగా వనస్థలిపురంలో ఒక కార్మికుడు మరణించగా, మరొకరు గల్లంతయ్యాడు. గతంలో మాదాపూర్ వద్ద నలుగురు ప్రైవేటు కార్మికులు పోగొట్టుకున్నారు. సైదాబాద్ వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి ఇద్దరు కూలీలను మ్యాన్‌హోల్‌లోకి దించడంతో విషవాయువులకు బలయ్యారు. ఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. తర్వాత పరిస్థితి షరామామూలే.
చినుకు పడితే అస్తవ్యస్తం
వర్షాకాలం వచ్చిందంటే మురుగు నీటి వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. పైపుల్లో ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు చేరి మురుగు ముందుకు కదలడంలేదు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడానికి జలమండలి, జీహెచ్‌ఎంసీ వద్ద చిన్న, పెద్ద కలిపి 140 వరకు ఎయిర్‌టెక్ యంత్రాలున్నాయి. వీటి పనితీరుపై స్వయంగా ప్రజా ప్రతినిధులే ఫిర్యాదులు చేస్తున్నారు. విజయనగర్‌కాలనీ, నాంపల్లి, మెహిదీపట్నం, చింతలబస్తీ తదితర ప్రాంతాల్లో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జలమండలికి 17,150 ఫిర్యాదులందాయి. ఒక్క జూన్‌లోనే దాదాపు 3,670 మంది ఫిర్యాదు చేశారు. ఆయా ప్రాంతాల్లో తరచూ మురుగు పొంగుతోందని, ఎయిర్‌టెక్ యంత్రాలు పంపాలని కోరారు. ఒక్క ఈ సబ్‌డివిజన్‌లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.
మురుగు నీరు పొంగినా...మ్యాన్‌హోళ్లలో చెత్తాచెదారం ఇరుక్కున్నా...ఈ ఎయిర్‌టెక్ యంత్రాలే శుభ్రం చేయాలి. గల్లీల్లో సమస్యలు పరిష్కరించడానికి 40 వరకు మినీ యంత్రాలున్నాయి. వీటిని సరిగా వినియోగించుకోవడం లేదు. ప్రధాన రహదారులపై తూతూ మంత్రంగా పనులు చేయడం తప్ఫ. బస్తీలు, గల్లీల్లో పెద్దగా దృష్టి పెట్టడం లేదు. రోజుల తరబడి మురుగు పొంగుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి కొందరు ప్రైవేటు కార్మికులతో మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాణనష్టం వాటిల్లుతోంది.
ముగ్గురిపై వేటు..
వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో మ్యాన్‌హోల్‌లోకి దిగిన శివ అనే వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తి అంతయ్య గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇంజినీర్లు భద్రత ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక విచారణలో తేలడంతో.. సహాయ ఇంజినీరు గౌతమ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు శ్రీకాంత్, నర్సింహారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశించారు. డీఈఈ, ఈఈ, ఎస్‌ఈలకూ షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్‌కు సూచిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
ఆమేరకు కమిషనర్ ఇంజినీరింగ్ విభాగాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించగా.. ముఖ్య ఇంజినీరు రాత్రికి ఉత్తర్వులు ఇచ్చారు. వర్క్‌ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌ను విధుల్లోంచి తొలగించారు. హయత్‌నగర్ డివిజన్ ఏఈ గౌతమ్‌రాజ్‌ను క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు సస్పెండ్ చేశారు. ఈఈ కె.రాజయ్యను క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ 48గంటల గడువు ఇస్తూ, వివరణ సరిగా లేకపోయినా, జవాబు రాకపోయినా వేటు తప్పదని షోకాజ్ నోటీసు ఇచ్చారు. శుక్రవారం రాత్రి వరకు అంతయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగించారు.
కావాలన్నారు.. వద్దన్నారు!
రాజధాని నగరంలో కీలకమైన మురుగునీటి పారుదల విషయంలో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మురుగునీటి వ్యవస్థను పర్యవేక్షణ చేసే సామర్థ్యం లేకపోయినా తమకు ఆ బాధ్యత కావాలని, ఆ తర్వాత కొద్దిరోజులకే వద్దని.. మురుగు వ్యవస్థతో బంతాట ఆడింది. 2007లో శివార్లలోని 12 పురపాలక సంఘాలు బల్దియాలో విలీనమైనప్పటి నుంచి దాదాపు 13 ఏళ్లపాటు జీహెచ్‌ఎంసీ మురుగునీటి వ్యవస్థను పర్యవేక్షించింది. ఈ సమయంలో డ్రైనేజీ పైపులైను విస్తరణ మీద ఏటా రూ.100 కోట్ల చొప్పున వ్యయం చేసినా ఫలితం కన్పించలేదు. ఏళ్ల తరబడి 66 డివిజన్లలో తూతూమంత్రంగానే పర్యవేక్షణ చేపట్టారు. అయితే జలమండలి మాత్రం తన పరిధిలో ఆధునిక యంత్రాలతో మురుగును తొలగించే పనిని మొదలుపెట్టింది.
కాగా డివిజన్లలో మురుగు సమస్య అస్తవ్యస్తంగా మారడంతో 2020 మార్చిలో పర్యవేక్షణ బాధ్యతను జలమండలికి అప్పగించారు. అదే ఏడాది అక్టోబర్‌లో మళ్లీ బల్దియాకు బదిలీ చేశారు. ఎప్పటిలాగే ఈసారీ మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దకపోవడంతో అనేక ప్రాంతాల్లో బల్దియా అధికారులు నిరసనలు ఎదుర్కొన్నారు. ఈపరిస్థితిని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ జలమండలికి ఈ వ్యవస్థను అప్పగించమని ఆదేశించింది. ఆగస్టులోనే బాధ్యతలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ కోరారు. అయితే సంబంధిత డివిజన్లలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ సాధ్యం కాదన్న ఉద్దేశంలో జలమండలిలోని కొంతమంది అధికారులు ఉన్నారు. సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇదీ చూడండి: HYDERABAD DRINAGE SYSTEM: రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!