Hyderabad Cricket Association Funds Golmaal : నిధులు గోల్‌మాల్ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోమారు వార్తల్లో నిలిచింది. తాజాగా హెచ్సీఎపై నాలుగు కేసులు ఉప్పల్ ఠాణాలో నమోదయ్యాయి. 2019- 2022 మధ్య అపెక్స్ కౌన్సిల్ ఉన్న సమయంలో బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, ఖర్చు చేసిన విధానం, టెండర్లు, కొటేషన్లు వంటివాటిపై ఫోరెన్సిక్ ఆడిట్‌లో అవకతవకలు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. 2019- 2022 మధ్య హెచ్సీఎ అధ్యక్షుడిగా అజారుద్దీన్, ఉపాధ్యక్షుడిగా జాన్‌మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, సంయుక్తకార్యదర్శిగా నరేశ్ శర్మ, కోశాధికారిగా సురేందర్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ ఉన్నారు.
Pratidwani: హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రక్షాళన ఎలా..?
Police Case Against HCA Funds Issue : కేసులు నమోదు చేసినా ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌లో ఎవరి పేర్లనూ చేర్చలేదు. ఫోర్జరీ, కుట్ర, నమ్మకద్రోహం, మోసం సెక్షన్లు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం బాధ్యుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తామని పోలీసులు తెలిపారు. సామాగ్రి సరఫరా చేసిన వ్యక్తులపైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కేసుల ప్రకారం సుమారు రూ.20 కోట్ల వరకూ కుంభకోణం జరిగిందని తెలుస్తోంది. కోర్టు కేసులు, వివాదాల నేపథ్యంలో హెచ్‌సీఎలో పరిస్థితుల్ని చక్కదిద్ది.. ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ సారథ్యంలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో అప్పటి ఏసీబీ చీఫ్ అంజనీకుమార్, క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ తదితరులు సభ్యులు. ఆ తర్వాత పరిస్థితిలో మార్పు రాలేదు.
ఎన్నికలు జరిగే వరకి హెచ్సీఎ పరిపాలనా వ్యవహారాలు చూసేందుకు సుప్రీంకోర్టు 14 ఫిబ్రవరి 2023న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు తనకు తోడ్పాటు అందించేందుకు ఎస్పీజీ మాజీ చీఫ్ దుర్గాప్రసాద్‌ని నియమించుకున్నారు. ఈ ఏడాది అక్టోబరు 20 హెచ్‌సీఏ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2019- 2022 వరకూ బీసీసీఐ కేటాయించిన నిధులు, టెండర్లు పిలవడం, ఖర్చు తదితర వ్యవహారంపై ఇటీవల ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో బకెట్ కుర్చీలు, అగ్నిమాపక, జిమ్ సామాగ్రి, క్రికెట్ బంతుల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంలో అవకతకలు జరిగాయని వెల్లడయినట్లు తెలిసింది. ప్రస్తుత హెచ్‌సీఏ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీల్ కంటే మంగళవారం ఉప్పల్ పోలీసులకు నాలుగు వేర్వేరు ఫిర్యాదులు అందించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు