ప్రజల సహకారం, వివిధ శాఖల సమన్వయం వల్ల లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. వారం రోజులుగా రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని అంజనీ కుమార్ తెలిపారు. ఎంజే మార్కెట్ వద్ద ఉన్న పోలీసు తనిఖీ కేంద్రాన్ని అంజనీ కుమార్ పరిశీలించారు. దాదాపు అర్ధగంట పాటు అక్కడే ఉండి వాహనాల రాకపోకలను పరిశీలించారు.
అనుమతి లేకుండా బయటికి వచ్చే వాహనదారులపై చట్టప్రకారం కేసు నమోదు చేయాలని పోలీసులకు సూచించారు. కరోనా వైరస్ రూపంలో ఉన్న శిరస్త్రాణాలు ధరించిన పోలీసులు.... రహదారులపై తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని... ప్రజలు మరింత సహకరించి వీలైనంత తొందరగా కరోనాను కట్టడి చేయడానికి సహకరించాలని అంజనీ కుమార్ కోరారు.