గాంధీ ఆస్పత్రి ఘటన కేసును 2 రోజుల్లో ఛేదిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఆస్పత్రి ఘటనలో ప్రతి నిమిషం ఏం జరిగిందో తెలుసుకున్నామని ఆయన వివరించారు. బాధితురాలు వ్యక్తిగత కారణాలతో కొన్ని విషయాలు చెప్పలేదని సీపీ తెలిపారు. విచారణలో 800 గంటల సీసీ దృశ్యాలు పరిశీలించామని చెప్పారు. పూర్తి సమాచారంతో నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు.
800 గంటల సీసీ ఫుటేజీని పరిశీలించాం..
500లకు పైగా సీసీ కెమెరాల పరిశీలన జరిగింది. 800 గంటల సీసీ ఫుటేజీని పరిశీలించాం. కొన్ని దృశ్యాలను టెక్నాలజీ సాయంతో పరిశోధించి చూశాం. 200 మందికి పైగా విచారించాం. అందులో గాంధీ ఆస్పత్రిలోని సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల్లోని వారిని కూడా విచారించాం. కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో అంతగా మిస్టరీ కూడా లేదు. మిస్సింగ్ లింక్స్ కూడా లేవు. పూర్తి సమాచారంతో నిందితులను కోర్టులో హాజరుపరుస్తాం. -అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ
ఒక్కొక్కటిగా బయటకు..
నాలుగు రోజులుగా పోలీసులను పరుగులు పెట్టించిన గాంధీ ఆస్పత్రి అత్యాచార కేసు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరిని ఆచూకీని గుర్తించిన పోలీసులు.. నారాయణగూడలోని ఓ ఔషధ దుకాణం వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆస్పత్రికి తన భర్తను చేర్పించిన వద్ద నుంచి ఏం జరిగిందన్న విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపిన పోలీసులు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో ఆ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటి నుంచి విధులకు హాజరుకాని గాంధీ ఆస్పత్రి భద్రతా సిబ్బంది విజయ కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా బాధితురాలిని.. శారీరకంగా కలిసినట్లు ఒప్పుకున్నాడు. అయితే ఆ మహిళ అంగీకారంతోనే శారీరకంగా కలిసినట్లు విజయ కిశోర్ పోలీసులకు వివరించాడు. అతను 8 నెలల క్రితమే విధుల్లో చేరినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: gandhi hospital rape: అత్యాచారం చేయలేదు.. ఆమె అంగీకారంతోనే వెళ్లా: సెక్యూరిటీ గార్డు