రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనగోళ్లకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,675 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
ఇప్పటి వరకు సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దృష్ట్యా... ఆయా జిల్లాల్లో అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు అదనంగా కేంద్రాలు ఏర్పాటు చేసుకునే ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
వాహనాలకు జీపీఎస్ యంత్రాలు
కేంద్ర ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా రైతులను చైతన్య పరచాలని కమిషనర్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి 24 గంటల్లో ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలి. ఈ క్రమంలో రైసు మిల్లులకు ధాన్యం తరలించే వాహనాలకు జీపీఎస్ యంత్రాలు అమర్చి అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు.