స్వచ్ఛ హుస్సేన్‌సాగర్...! హుస్సేన్‌సాగర్ జలాశయం శుద్ధి కోసం హెచ్ఎండీఏ చేస్తున్న ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయి. సాగర్‌లోకి వచ్చే చెత్తను తొలగిస్తూనే...నీటిలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారు. గతంలో సున్నాగా ఉన్న ఆక్సిజన్ నేడు 8 శాతానికి చేరుకుంది. క్లీన్ హుస్సేన్‌సాగర్ కింద హెచ్ఎండీఏ చేపట్టిన ప్రక్రియపై కథనం.
బయో రెమిడేషన్ విధానంతో మురుగునీటి శుద్ధి ప్రక్రియను నాకాఫ్ సంస్థ చేపడుతోంది. ఎగువ ప్రాంతం నుంచి సాగర్ జలశాయంలోకి మురుగు, రసాయన వ్యర్థాలు వచ్చి చేరుతుండడంతో దుర్వాసన వస్తుండేది. బయో రెమిడేషన్‌తో చెడు బ్యాక్టీరియాకు అంతమెందిస్తోంది హెచ్ఎండీఏ.
తీవ్ర దుర్గంధం వచ్చే ప్రాంతాల్లో ఐఎం స్ప్రే చల్లడం వల్ల వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతోంది. రెండోదశలో బొకాషి బాల్స్‌ను జలాశయంలోకి వదులుతున్నారు. దీంతో చెడు బ్యాక్టీరియా తగ్గి నీటి నాణ్యతను పెంచే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ శాతం కూడా పెరుగుతోంది.
ప్రతి రోజు నాళాల నుంచి వచ్చే చెత్తను తీసేసే కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోందని అధికారులు అంటున్నారు. అయితే ఈ విషయంలో ప్రజల్లో కూడా విస్త్రృత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.