మీ భర్త వేరొక స్త్రీతో సంబంధం పెట్టుకుని, ఆమె మిమ్మల్ని బెదిరిస్తోందంటే అతడామెకి లొంగిపోయి, మీ అభిప్రాయం, మానసిక స్థితి, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం లేదు. అస్థిరత్వంతో ఊగుతూ తన జీవితాన్ని ఆమె చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. మీకు చట్టపరంగా పెళ్లయింది కనుక అతడి ప్రవర్తన, విడాకులివ్వమని ఆమె అనడం ఏమిటని అతన్ని ప్రశ్నించండి. తన అభిప్రాయమేంటో తెలుసుకోండి. ఊగిసలాటలో ఉన్నాడనిపిస్తే మీ అత్తమామలు, అమ్మానాన్నలతో చర్చించి వాళ్ల ఉద్దేశమేంటో అడగండి. వాళ్లు మీ ఇద్దరితో వ్యక్తిగతంగా, విడివిడిగా మాట్లాడి సమస్యను పరిష్కరించగలరేమో చూడండి. బయటి స్త్రీ ముఖ్యం కాదు. కానీ ఆమెకి అధికారం ఇచ్చాడంటే అతడు స్థిరంగా లేక, తన గురించి తాను తెలుసుకోలేక పోతున్నాడు. చర్చించాక కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నా, పెద్దవాళ్లు మీ సంగతి మీరే చూసుకోవాలి, మేమేమీ చేయలేమంటే మీరే నిర్ణయించుకోండి.
అతడికి ప్రేమ లేనప్పుడు, తన జీవితాన్ని ఇంకోవ్యక్తికి అప్పగించాడంటే మీరింకా అదే ఆలోచించి కుంగిపోనవసరం లేదు. ప్రేమ లేనిచోట కాపురం కష్టం. అతడు మీ దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్తున్నాడంటే మిమ్మల్నో వస్తువులా వాడుకునే ఆస్కారం మీరే ఇచ్చారు. అలా వద్దు. ముందు అతడితో మాట్లాడి స్పష్టం చేసుకోండి. లేదంటే మీవైపు తప్పులేదని స్పష్టమయ్యేలా పెద్దలకు చెప్పండి. అతడిలో మార్పు లేకుంటే విడిపోవడమే మంచిది. పిల్లల చదువు, పెళ్లిళ్ల బాధ్యత అతడే తీసుకునేట్లు ఏర్పాటు చేసుకోండి. పెద్దలతో చెప్పించినా అవన్నీ నెరవేరవు కనుక కోర్టు ద్వారానే ప్రయత్నించండి.