బానిసత్వం నుంచి బయటపడిన శుభ సందర్భానికి సాక్ష్యంగా నిలిచింది.. జాతీయ పతాకమే. ఎత్తుగా ఎగిరే జెండాయే.. స్వాభిమానానికి సంకేతం. ప్రతిచోటా దేశానికి ప్రాతినిధ్యం వహించే ఈ తిరంగా.. శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ మార్చి 31 నాటికి వందేళ్ల మైలురాయి దాటనుంది.
ఎవరెస్టు ఎక్కినా.. చంద్ర మండలంపై అడుగు పెట్టినా.. అంతర్జాతీయ స్థాయిలో ఆటల్లో రాణించినా.. ఇలా విజయం సాధించిన ప్రతి సందర్భంలో కళ్ల ముందు కనిపించేది దేశపు జెండాయే. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ పతాకను ఎగరేయందే.. ఆ విజయానికి విలువ ఉండదు అని బలంగా విశ్వసిస్తారు అంతా. స్వేచ్ఛ, అస్తిత్వం, దేశ భక్తి, ప్రతిష్ఠలను చాటే.. స్వాభిమాన గీతిక...జాతీయ పతాక.
ఆ త్రివర్ణ పతాకం అంతెత్తున రెపరెపలాడుతుంటే...ఏదో తెలియని భావోద్వేగం కలుగుతుంది. మరీ ముఖ్యంగా.. బానిసత్వాన్ని ఎదిరించి గెలిచిన భారత్ లాంటి దేశాల్లో జాతీయ జెండాకున్న ప్రాధాన్యత వెలకట్టలేనిది.
ఎక్కడ త్రివర్ణపతాకం కనిపించినా.. స్వతంత్ర సాధన కోసం ఉద్యమించిన వారి తపన గుర్తొస్తుంది. ఈ కల సాకారం చేసుకునేందుకు వారు పడిన కష్టమేంటో తెలిసొస్తుంది. స్వాతంత్య్ర సమర యోధుల పోరాట పటిమకు, స్వరాజ్యోద్యమానికి సాక్ష్యంగా నిలిచిన మన త్రివర్ణపతాకం.. వందేళ్లు పూర్తి చేసుకోనుంది.
జాతీయపతాకం రూపొందించి.. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి వందేళ్లు. స్వేచ్ఛాభారాతానికి చిహ్నంగా ఆసేతుహిమాచలం.. రెపరెపలాడే మువ్వన్నెల జెండా శతవసంతాల పండుగ సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది యావత్ దేశం.
ఇదీ చదవండి: పింగళి తీసుకెళ్లిన జాతీయ పతాకాన్ని చూసి గాంధీ ఏమన్నారు..?