హైదరాబాద్ గోషామహల్ డివిజన్‌లోని బస్తీల్లో ఆదిత్య కృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ నంద కిషోర్ వ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో ఫ్యాప్సీ డైరెక్టర్ రాజేందర్ అగర్వాల్ చేతుల మీదుగా 400వందల మంది నిరుపేదలకు బియ్యం, మాస్కులు అందించారు. భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తికావడంతో ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్‌లో నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి. గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఆధ్వర్యంలో లాక్‌డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మల్లేపల్లి బీజేవైఎం ఆధ్వర్యంలో 250 మంది పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై.. నిర్వాహకులను అభినందించారు.
కష్టకాలంలో సాయం
తుంగతుర్తి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఎస్సీ విభాగం ఛైర్మన్ ప్రీతమ్ పేదల కోసం ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వాట్సాప్ గ్రూప్ ఆధ్వర్యంలో బ్లాక్ ఫంగస్‌తో మృతిచెందిన రావుల వెంకన్న కుటుంబానికి.. 31 వేల సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఎస్సై ఉదయ్‌కిరణ్ చేతులమీదుగా అందించారు. యాదగిరిగుట్టలో బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చిన 'ఉచిత అంబులెన్స్' సేవను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం అంబులెన్స్‌ను స్వయంగా నడిపారు. అంతకుముందు పీహెచ్సీలో ఆరోగ్యసిబ్బందికి చీరలు, మాస్కులు, శానిటైజర్లు, అందించారు.
అండగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని మచ్చపూర్, గోవిందరావుపేట, గాంధీనగర్ గ్రామాల్లో 60 కుటుంబాలకు.. సర్వర్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంచిర్యాలలో కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని మారుమూల పల్లెల్లో లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు కావేరి ఫౌండేషన్ అండగా నిలిచింది. పిల్లల వైద్యులు డాక్టర్ చక్రధారితో వైద్యపరీక్షలు నిర్వహించి ఔషధాలు అందించడమే కాకుండా... 100 ఆదివాసీ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, పండ్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో ప్రవాస భారతీయులు సమకూర్చిన ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు, అంబులెన్సును వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రారంభించారు. బోయింగ్ ఇండియా సీఎస్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ అంబులెన్స్‌ను, శ్రీనివాస్, మోహన్ రెండు ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు అందించినట్లు తెలిపారు. లాక్‌డౌన్ వల్ల భోజనానికి ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు కరీంనగర్‌లో యువ సేన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహారం అందించారు. రోజూ 150 మందికి భోజనం, అల్పాహారం అందిస్తున్నామని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి స్వప్న తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిర ప్రభుతాసుపత్రిలో స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రవాస తెలంగాణ ప్రజల సహకారంతో..... ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, కలెక్టర్ కర్ణన్ ప్రారంభించారు.
ఇదీ చదవండి: టీకా గురించి ఈ స్లోగన్స్ అదుర్స్ గురూ!