తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో కూడా వాణిజ్య పన్నుల రాబడులు భారీగానే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే... గడిచిన నాలుగు నెలల్లో వచ్చిన ఆదాయం దాదాపు రెట్టింపు అయింది. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల రాబడులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఈ ఆర్థిక ఏడాది మాత్రం వ్యాపార, వాణిజ్య పరమైన కార్యకలాపాలపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. దీంతో వాట్, జీఎస్టీ రాబడులపై కూడా ఆ ప్రభావం కనిపించలేదు.2019-20 ఆర్థిక ఏడాది మొదటి నాలుగు నెలలకు రూ.14,779 కోట్లు రాబడి రాగా, 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ.10,061 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది.
కరోనా మొదటి దశ ప్రభావంతో ఆదాయం తగ్గింది. ఇక గతేడాది ఆర్ధిక సంవత్సరంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్నప్పటికీ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల ఆ ప్రభావం వ్యాపార, వాణిజ్యంపై పెద్దగా పడలేదు. ఇందువల్లనే ఈ నాలుగు నెలల్లో ఏకంగా రూ.19,527 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వచ్చిన వాణిజ్య పన్నుల రాబడులను అంశాల వారిగా పరిశీలించినట్లైతే పెట్రోలియం ఉత్పత్తులపై వాట్ రూ.4055 కోట్లు, మద్యం అమ్మకాలపై వాట్ రూ.4095 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రూ.4340 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.3977 కోట్లు, ఇతర ఆదాయం కింద రూ.222కోట్లు, జీఎస్టీ పరిహారం కింద రూ.2838 కోట్లు లెక్కన రాష్ట్ర ప్రభుత్వానికి రాబడులు వచ్చాయి.
పెట్రోల్, డీజల్ ధరలు పెరిగే కొద్దీ... వాటి అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాట్ రాబడి పెరుగుతోంది. జులై నెలలో రికార్డు స్థాయిలో పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా రూ.1100 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన మూడు నెలల రాబడితో పోలిస్తే జులై నెల ఆదాయం అత్యధికం. ఈ ఆర్ధిక సంవత్సరం పెట్రోల్, డీజల్ ద్వారా వాట్ రాబడి వెయ్యి కోట్లు దాటి రావడం ఇది రెండోసారి. పెట్రోలు లీటర్ పై 35.20 శాతం, డీజల్ లీటర్ పై 27 శాతం లెక్కన తెలంగాణ రాష్ట్రంలో అమ్మకం పన్ను ప్రభుత్వం విధిస్తోంది. దీంతో వాటి ధరలు పెరిగే కొద్దీ రాష్ట్ర ఖజానాకు పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై వచ్చే వాట్ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది.
ఇదీ చూడండి: ఒక్కో ప్రాజెక్టుదీ ఒక్కో కథ.. ప్రశ్నార్థకంగా జలాశయాల భవిష్యత్తు