Fish Markets: వసంత రుతువు మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో చేపలు కొనేందుకు జనాలు మార్కెట్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఫలితంగా మార్కెట్లు సందడిగా మారాయి. నాలుగు రోజులుగా పొరుగు రాష్ట్రాలతో పాటు, తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి వందలాది లారీల్లో చేపల్ని హైదరాబాద్‌లో ముషీరాబాద్ మార్కెట్‌కు తీసుకువచ్చారు. ఉదయం 6 గంటల వరకే 400 టన్నుల పైగా చేపల అమ్మకాలు జరిగాయని వ్యాపారులు తెలిపారు. కొరమీను సాధారణంగా 550 రూపాయలు పలికేదని... ప్రస్తుతం కేవలం 450 పలుకుతుందన్నారు. గతంతో పోలిస్తే ధర తగ్గిందని వ్యాపారులు వెల్లడించారు.
హనుమకొండలో చేపల మార్కెట్ రద్దీగా మారింది. కుమార్ పల్లిలోని మార్కెట్లో చేపలు కొనేందుకు ప్రజలు బారులు తీరారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఉదయం నుంచి భారీగా చేపల విక్రయాలు జరిగాయి. ధరలు వంద రూపాయల నుంచి మెుదలుకొని 600 వరకు పలికాయి. కొర్రమీను, బంగారు తీగ, బొచ్చె వంటి చేపలను వినియోగదారులు కొనుగోలు చేశారు. నిర్మల్‌లోని బోయివాడ చేపల మార్కెట్ కొనుగోలుదారులతో సందడి నెలకొంది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలను తీసుకొచ్చి విక్రయించగా వాటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి, కోరుట్లలోనూ చేపల కోసం ప్రజలు తెల్లవారుజాము నుంచే వరుస కట్టారు. గంటల తరబడి వేచిచూసి కొనుగోలు చేశారు. మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని ప్రజలు విశ్వసిస్తారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి:
జూబ్లీహిల్స్ రేప్ కేసుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
విమానాల్లో మాస్కు తప్పనిసరి.. లేదంటే బోర్డింగ్ పాయింట్లోనే..