హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 14 తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ విధానం, ఎలాంటి కార్డులను ఉపయోగించి ఓటు వేయొచ్చు అనే విషయాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక వెల్లడించారు. ఈ నియోజకవర్గంలో ఈసారి అత్యధిక మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 93 మంది అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపర్లో ఉండనున్నాయి. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో 1, 2, 3, 4 ఇలా ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్వో సూచించారు. మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాలని.... ఒక్కరికీ ఓటు వేయవచ్చు లేదా కొంత మందికి లేదా అందరికి వేయవచ్చని అది ఓటరు ఇష్టమని ఆమె పేర్కొన్నారు. కానీ ప్రాధాన్యత మాత్రం తప్పితే... మొదటి ప్రాధాన్యత వేసి, రెండో ప్రాధాన్యత ఓటు వేయకుండా.. మూడో ప్రాధాన్యత వేస్తే మాత్రం ఓటు చెల్లదని పేర్కొన్నారు.
అంకెలు మాత్రమే రాయాలి..
బ్యాలెట్ పేపర్‌పై కేవలం 1, 2, 3 అను అంకెలు మాత్రమే రాయాలని.. రోమన్ అంకెలు రాయకూడదన్నారు. ఒకటి, రెండు... అని తెలుగులో కూడా రాయొద్దని.. టిక్ లాంటివి, ఇంగ్లీష్‌లో వన్, టూ అని రాసినా ఆ ఓట్లు చెల్లకుండా పోతాయని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఏదేని 9 గుర్తింపు కార్డుల్లో ఒకదానితో ఓటు వేయొచ్చని చెప్పారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటి కార్డ్, పాన్ కార్డు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలకు జారీచేసిన అధికార గుర్తింపు పత్రం, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీచేసిన డిగ్రీ, డిప్లొమా ఒరిజనల్ సర్టిఫికేట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డు చూపాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం