రాష్ట్రంలో ఇప్పటి వరకు 60 వేల కరోనా కేసులు నమోదైతే.. 85 శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించినవే. 530 మంది కరోనాతో చనిపోతే దాదాపు 480 మంది ఈ మూడు జిల్లాలవారే ఉన్నారు. శనివారం ఈ మూడు జిల్లాల్లో కలిపి 1003 మంది కరోనా బారినపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బట్టి హైదరాబాద్ మహానగరంలో కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 18 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. అందులో 85 శాతం మంది ఇంట్లోనే వైద్యం పొందుతున్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోయినా పడకలు లభించక.. వేరే మార్గం లేక.. ఇంట్లోనే ఉంటున్నారు.
’ప్రైవేటు’లో అడ్వాన్స్ చెల్లించాల్సిందే
రాష్ట్రవ్యాప్తంగా 94 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు వైద్యం అందుతోంది. వీటిలో 90 శాతం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో దాదాపు 2381 పడకలు ఖాళీగా ఉన్నా బాధితులకు మాత్రం పడకలు ఖాళీ లేవని చెప్పి పంపించేస్తున్నారు. జులై 31నఎల్బీనగర్‌కు చెందిన ఒక బాధితుడికి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. నాలుగైదు ఆస్పత్రులకు వెళ్లినా వెంటిలేటర్‌తో కూడిన పడక దొరకలేదు. మరుసటి రోజు అతడు చనిపోయాడు. పరిస్థితి ఇలా ఉంటే.. చాలా ఆస్పత్రులు అడ్వాన్స్ కింద రూ.2లక్షల-రూ.5లక్షల నగదు కడితేనే.. పడకను కేటాయిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రులు దయతలిచి బాధితుల ప్రాణాలు నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
చెప్పేది ఒకటి.. వాస్తవం మరొకటి!
ఎట్టి పరిస్థితుల్లో కరోనా బాధితులకు పూర్తిస్థాయి వైద్యం అందించాలని ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశిస్తున్నారు. దీనికి భిన్నంగా ప్రభుత్వ వైద్యం ఉంది. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరి ప్రాణాలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా అక్కడి అధికారులు, సిబ్బంది కరుణ చూపడంలేదు. కింగ్‌కోఠి, ఫీవర్, ఛాతీ తదితర వైద్యశాలలకు వెళితే మీకు లక్షణాలు అధికంగా ఉన్నాయి.. ఆక్సిజన్ పెట్టాలి.. వెంటిలేటర్ అవసరం.. గాంధీకి వెళ్లండని పంపుతున్నారు. గాంధీకి వెళ్లిన వారిలో కొందరిని మాత్రమే చేర్చుకొని కొందరిని ఇంటికి వెళ్లి వైద్యం పొందండంటూ మందులు ఇచ్చి పంపించేస్తున్నారు. అప్పటికే ఊపిరితీసుకోవడం కష్టమైన కొందరు బాధితులు ఇంటికెళ్లిన కొద్ది రోజులకే చనిపోయిన దాఖలాలున్నాయి.
పడకల లెక్క ఇదిగో..
ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 3737 పడకలు ఉంటే.. అందులో కేవలం 1246 మాత్రమే కరోనా బాధితులకు కేటాయించారు. మిగతా.. 2491 పడకలు ఖాళీగానే ఉన్నాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 6422 పడకలు ఉండగా.. అందుబో 4041 పడకలు బాధితులకు కేటాయించారు. 2381 పడకలు ఖాళీగానే ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రుల విషయానికొస్తే.. గాంధీలో 1890 పడకలు ఉండగా 915 కరోనా బాధితులకు కేటాయించగా.. 975 పడకలు ఖాళీగా ఉన్నాయి. టిమ్స్‌లో మొత్తం 1261 పడకలు ఉండగా అందులో కేవలం 92 మాత్రమే కరోనా బాధితులతో నిండి ఉన్నాయి. మిగతా 1169 ఖాళీగా ఉన్నాయి. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 350 పడకలు ఉండగా.. 152 పడకలు కరోనా బాధితులకు కేటాయించారు. మిగతా 198 పడకలు ఖాళీగానే ఉన్నాయి. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 100 పడకలు ఉంటే.. 21 పడకలు పాజిటివ్ బాధితులకు కేటాయించి 79 పడకలు ఖాళీగా ఉంచారు. ఛాతీ ఆస్పత్రిలో 136 పడకలు ఉంటే.. 66 పడకలు బాధితులకు కేటాయించి 70 పడకలు ఖాళీగా ఉంచారు. దీన్ని బట్టి చూస్తే.. వివిధ ఆస్పత్రుల్లో పడకలు ఉన్నప్పటికీ.. వాటిని బాధితులకు కేటాయిస్తే.. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువ చూపించాల్సి వస్తుందని కేటాయించడం లేదని, చాలావరకు హోం క్వారంటైన్‌కి పంపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్