రాష్ట్రంలో ఉద్యాన అనుబంధంగా తేనెటీగల పెంపకం ప్రోత్సహించనున్నామని ఉద్యానశాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్‌హిల్స్ తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో తేనెటీగల పెంపకంపై సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ ఉపసంచాలకులు వేణుగోపాల్, రుతిక ఇన్నోవేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ ఇందిరా రెడ్డి, రైతు సంపద ప్రొడ్యూసర్స్ కంపెనీ ప్రతినిధి లక్ష్మి, మిత్రా ఫౌండేషన్ హైదరాబాద్ ప్రతినిధి ఎన్.రామచంద్రయ్య పాల్గొన్నారు.
రాష్ట్రంలో తేనెటీగల పెంపకానికి గల అవకాశాలు, మార్కెటింగ్, వినియోగం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయి రైతులు, అధికారులకు సమగ్ర శిక్షణ ఇవ్వడం ద్వారా తేనెటీగల పెంపకం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కాగా... ఇప్పటికే వాణిజ్యపరంగా సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో కొందరు ఔత్సాహికులు తేనెటీగల పెంపకం చేపట్టి చక్కటి పలితాలు సాధిస్తున్నారని ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. కేవలం 50 తేనెటీగల పెట్టెలతో ఒక సంవత్సరానికి 1 నుంచి 1.20 లక్షల రూపాయల నికర ఆదాయం పొందవచ్చని... ఇందుకు రైతులు ముందుకు రావాలని సంచాలకులు వెంకట రామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: నేటి నుంచి 45 ఏళ్లు దాటిన వారికి కొవిడ్ వ్యాక్సిన్: డీహెచ్