పోలీసు కానిస్టేబుళ్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదు. ఆరోగ్య భద్రత, ఏకరూప దుస్తుల అలెవెన్స్ను ఇవ్వడం లేదు. గతంలో వీటిని అమలు చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నేటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారేమోననే ఆందోళనతో వారు నోరు విప్పడం లేదు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని తొమ్మిది కమిషనరేట్లు, జిల్లాలలో పనిచేస్తున్న సుమారు 18 వేల మంది హోంగార్డులకు.. పోలీసు వారి కుటుంబసభ్యులకు ఇస్తున్న ఆరోగ్యభద్రత పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు.
దుస్తులకు లోటు
ఏకరూప దుస్తుల కోసం ఏటా 7500 రూపాయలు హోంగార్డులకు ఇస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లలోని హోంగార్డులను మినహాయించి జిల్లాల్లో పనిచేస్తున్న 9 వేల మంది హోంగార్డులకు ఏకరూప దుస్తుల అలెవెన్స్ రాలేదు. ఆరోగ్య భద్రత పథకానికి హోంగార్డులు అనర్హులవడం వల్ల తమకు వచ్చే జీతంలో ఎక్కువ మొత్తం వైద్య ఖర్చులకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి బందోబస్తు, సమ్మెలైనా మొదట గుర్తొచ్చేది హోంగార్డులే! కానీ వారికే ఆరోగ్య భద్రత కరవైంది. కానిస్టేబుళ్లకు ఇచ్చే డైట్ చార్జీతో సమానంగా హోంగార్డులకు బత్తా ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా... అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
కానిస్టేబుళ్లకు ఇచ్చారు.. మాకేవీ..
ఇటీవల ఆర్టీసీ సమ్మె జరిగిన సమయంలో బందోబస్తు, విధులు నిర్వహించిన కానిస్టేబుళ్లకు 11 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఈ మొత్తం చెల్లించారు. అయితే వారితో సమానంగా విధులు నిర్వర్తించిన హోంగార్డులకు మాత్రం ఎటువంటి అలవెన్సు చెల్లించపోవడం వల్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు తమకు అలవెన్సులు, ఏకరూప దుస్తుల కోసం నగదు ఇవ్వాలని హోంగార్డులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: మానవహక్కుల సంఘం ఎంపిక కమిటీ సమావేశం