TCL joint venture with Resoget invest in Telangana : తెలంగాణ రాష్ట్రానికి మరొక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ రానుంది. రూ. 225 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో టీసీఎల్ సంస్థ అడుగు పెట్టనుంది. తొలి దశలో 500లకు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో టీసీఎల్ సంస్థ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
తెలంగాణ కంపెనీ రిసోజెట్‌తో కలిసి టీసీఎల్ ఒక జాయింట్ వెంచర్ సంస్థ రూపంలో ప్రపంచ స్థాయి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ రంగంలో విస్తృత ఉత్పత్తుల శ్రేణిని కలిగిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్.. తన ప్రధాన కేంద్రం అయిన చైనాలోని హెఫెయి నగరం తర్వాత విదేశంలో ఏర్పాటు చేస్తున్న తొలి తయారీ యూనిట్ ఇదే కావడం విశేషం.
తొలుత వాషింగ్ మెషిన్లను తయారు చేసేందుకు ఉద్దేశించిన ఈ తయారీ కేంద్రం నుంచి సమీప భవిష్యత్తులో రిఫ్రిజిరేటర్లు, డిష్ వాషర్లను కూడా ఉత్పత్తి చేసేందుకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. రంగారెడ్డి జిల్లాలోని రావిర్యాలలో ఉన్న ఈ-సిటీలో ఏర్పాటు చేయనున్న తయారీ యూనిట్ కోసం టీసీఎల్ సంస్ధ 225 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నది.
ఈ తయారీ యూనిట్ ద్వారా సుమారు 500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు తొలిదశలోనే రానున్నట్లు సంస్థ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రానికి టీసీఎల్ కంపెనీని స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర కంపెనీ అయిన రిసోజెట్ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా టీసీఎల్ కంపెనీతో కలిసి ముందుకు వెళ్లడం విశేషం అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని.. తెలంగాణ రాష్ట్రం నుంచి హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ రోజు టీసీఎల్ కంపెనీ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ రంగంలో తన స్థానాన్ని మరింత బలపపరుచుకుంటుందని ట్విటర్లో ఆశాభావం వ్యక్తం చేశారు.
Lulu Investments in Hyderabad : రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌పోర్ట్ అండ్ రిటైల్ రంగంలో తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు అంతర్జాతీయ సంస్థ లులూ ముందుకు వచ్చింది. ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు యూసఫ్ అలీ తెలిపారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో లులూ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్నామని.. ఆ పనులు దాదాపు పూర్తైనట్లు వివరించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి హైదరాబాద్ నగరంలో లులూ మాల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఇవీ చదవండి: