డంపింగ్ యార్డులను తలపించేలా చుట్టూ పేరుకుపోయిన చెత్తా చెదారం.. నిర్మాణ వ్యర్థాలతో పొంగి పొర్లే మురుగు.. భరించలేని కంపు.. ఇదీ నగరంలోని నాలాల దుస్థితి. అలాంటి ప్రాంతాలను నందనవనాలుగా తీర్చి దిద్దేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రంగంలోకి దిగింది. బేగంపేట తరహాలోనే మరో 9 చోట్ల ‘రెయిన్ గార్డెన్స్’ను అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూడు నెలల్లోపు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రూ.1.50 కోట్లతో బేగంపేటలో..
జీడిమెట్ల, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షపు నీటిని కూకట్‌పల్లి నాలా హుస్సేన్‌సాగర్‌కు తీసుకెళ్తుంది. నాలా చుట్టూ పరిశ్రమలు రావడంతో మంచినీటి ప్రవాహం కనుమరుగై.. పారిశ్రామిక రసాయన వ్యర్థాలతో కూడిన మురుగు పారుతోంది. బేగంపేట్ పై వంతెన సమీపంలోని నాలా పరిస్థితి దారుణంగా మారింది. నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్‌కు అడ్డాగా మారింది. కంపు సమీప ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఈ తరుణంలోనే హెచ్‌ఎండీఏ రూ.1.50 కోట్లతో 400 మీటర్ల విస్తీర్ణంలో సుందరీకరణ పనులను చేపట్టింది. విభిన్న ఆకృతులతో ‘రెయిన్ గార్డెన్’ను అభివృద్ధి చేసింది. నాలా మధ్యలో ఉన్న రాళ్ల గుట్టలపై మొక్కలు నాటి, వాటి చుట్టూ నడిచేలా వంతెన నిర్మించనున్నారు. మురుగు ప్రవాహం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవడంతో అనతికాలంలోనే ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ అభినందించి.. మరిన్ని ప్రాంతాల్లోనూ పనులు చేపట్టాలంటూ సూచించారు.
100 మీటర్ల నుంచి 650 మీటర్ల విస్తీర్ణం
బేగంపేట స్ఫూర్తితో హెచ్‌ఎండీఏ అధికారులు ఎక్కడెక్కడ ‘రెయిన్ గార్డెన్స్’ను అభివృద్ధికి అవకాశముందో అధ్యయనం చేశారు. 9 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఒక్కో దగ్గర 100 మీటర్ల నుంచి 650 మీటర్ల విస్తీర్ణంలో పనులు చేపట్టనున్నారు. పూడికతీసి, చుట్లూ ఉన్న ఆక్రమణలను తొలగిస్తారు. ప్రవాహం సాఫీగా సాగేలా రక్షణ గోడలను నిర్మిస్తారు. వ్యర్థాలను తొలగించి.. అలంకరణ చెట్లు, వాకింగ్ ట్రాక్, ఇతరత్రా సుందరీకరణ పనులు చేపడతారు. రాయి లేదా చెక్క శిల్పాలను ఏర్పాటు చేస్తారు. పైవంతెనకూ మరమ్మతులు చేస్తారు. అత్యాధునిక లైట్లను బిగించి మరిన్ని అదనపు సొబగులను అద్దుతారు.
ఎక్కడెక్కడ అంటే..
1. ఎల్లమ్మ గుడి దగ్గర, ఏడో ఫేజ్, కూకట్‌పల్లి
2. ముండికుంట, చందానగర్
3. భగత్‌నాలా, ఉప్పల్
4. నాగోల్ పైవంతెనకు సమీపంలో (మూసీకి ఇరువైపులా)
5. మూసీ పరీవాహక ప్రాంతం, చాదర్‌ఘాట్
6. అత్తాపూర్ పైవంతెన కింద పైపులైన్స్ రోడ్డు, రాజేంద్రనగర్
7. అత్తాపూర్ పైవంతెన కింద
8. ఉప్పల్ చెరువు నాలా
9. పీజేఆర్ విగ్రహానికి సమీపంలో, ఖైరతాబాద్
ఇదీ చదవండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!