ఆంధ్రప్రదేశ్ అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అధికార పార్టీ రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ కేసును ఆయుధంగా ఉపయోగించారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం తనపై, తెదేపా సభ్యులపై చట్టవిరుద్ధ చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ కేసు నమోదు చేసిందన్నారు. అక్రమ పద్ధతిలో తెదేపా నేతలను కేసుల్లో ఇరికించడం, విచారణల పేరుతో వేధించడాన్ని న్యాయస్థానాలు తప్పుపట్టాయని, ఆ కేసుల్ని కొట్టేశాయని గుర్తుచేశారు.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సీఐడీ అధికారులు ఈ నెల 12న తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ కేసు విషయంలో అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. మంగళగిరి సీఐడీ ఠాణా స్టేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారి, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఇదే వ్యవహారంపై సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ మంత్రి పి.నారాయణ గురువారం హైకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. అరెస్ట్‌తో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆళ్ల ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఏపీ అసైన్డు భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద ఈ నెల 12న కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
శుక్రవారమే విచారణ జరపండి..
చంద్రబాబు, నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాల గురించి సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ గురువారం కోర్టు విచారణ ప్రారంభ సమయంలో జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ముందు ప్రస్తావించారు. పిటిషనర్లను విచారణకు హాజరుకావాలని సీడీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. మాజీ మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారన్నారు. శుక్రవారం ఈ వ్యాజ్యాలపై విచారణ జరపాలని అభ్యర్థించగా న్యాయమూర్తి అంగీకరించారు.
చంద్రబాబు వ్యాజ్యంలో పేర్కొన్న అంశాలివే..
విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు కోసం 2014 సెప్టెంబర్ 1న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి సెప్టెంబర్ 4న శాసనసభ ముందు ఉంచారు. సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. తర్వాత రాజధాని గ్రామాల ప్రజలకు భూసమీకరణ విధానాన్ని తెలిపాం. రాజధాని నగర ప్రాజెక్ట్‌లో వారు ఎలా భాగస్వాములవుతారో వివరించాం. ప్రజల ఆకాంక్ష మేరకు భూసమీకరణ పథకాన్ని తీసుకొచ్చాం. ఏపీ సీఆర్‌డీఏ చట్టాన్ని రూపొందించాం.
* భూసమీకరణపై 2015 జనవరి 1న జీవో 1 జారీ చేశాం. అసైన్డు భూముల హక్కుదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చాం. చట్ట నిబంధనల మేరకే ఆ జీవో జారీచేశారు. ఆరేళ్లు గడిచాక రాజకీయ ప్రత్యర్థి దురుద్దేశంతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాపై తప్పుడు కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలోని సభ్యులను అక్రమ కేసుల్లో ఇరికించాలనే దురుద్దేశం దీనిద్వారా స్పష్టమవుతోంది.
* గత ప్రభుత్వ హయాంలో జీవో తీసుకొచ్చారనే కారణంతో అప్పటి సీఎం బాధ్యులనడానికి వీల్లేదు. నిబంధనలపై అభ్యంతరం ఉంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి న్యాయస్థానంలో సవాలు చేసుకోవచ్చు. అంతే తప్ప అప్పటి ప్రభుత్వ హయాంలో నిబంధనలు రూపొందించారనే కారణంతో నన్ను నేర బాధ్యులుగా పేర్కొనడం అసంబద్ధం.
* నూతన భూసేకరణ చట్టం-2013కి విరుద్ధంగా జీవో 41 ద్వారా నిబంధనలు రూపొందించారనేది ఫిర్యాదుదారు ఆరోపణ. అలాంటప్పుడు ఆ చర్య నేరం ఎలా అవుతుంది?
* నవులూరు గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. భూములు తీసుకోవడం వల్ల సొమ్ము నష్టపోయామని గ్రామస్థులుగానీ, భూ యజమానులుగానీ ఇన్నేళ్లలో ముందుకు రాలేదు. వారి తరఫున ఎమ్మెల్యే అత్యుత్సాహం చూస్తుంటే సందేహం కలుగుతోంది.
జీవో జారీ చేయడమే నేరమా?
జీవో 41 ఏ చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా లేదు. అందువల్ల దాన్ని జారీ చేయడాన్ని నేర పరిధిలోకి తీసుకురావడానికి వీల్లేదు. పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ఫలానా వ్యక్తులు నేరానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు, నాపై నేర దర్యాప్తు అవసరమనిగానీ లేదు. యాంత్రిక ధోరణిలో నన్ను నిందితుడిగా పేర్కొన్నారు. ఫలానా చట్టం సరైంది అని కానీ లేదా దురుద్దేశంతో రూపొందించారని కానీ ఏ పోలీసు అధికారీ శాసనకర్తలను దర్యాప్తు చేయడానికి వీల్లేదు.
* ఫిర్యాదులోని అంశాలు వాస్తవమని ఒకవేళ భావించినా.. అప్పటి సీఎం నేరానికి పాల్పడ్డట్లు వివరాలే లేవు.
* ఏపీసీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం.. ప్రభుత్వం, అథార్టీ, అధికారి తీసుకున్న చర్యలపై దావా, ప్రాసిక్యూషన్ జరపడం నిషేధం.
* ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవు.
* నాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయాలంటే.. బాధితుడు ఎస్సీ, ఎస్టీ అయి ఉండాలి. తప్పుడు మార్గంలో ఎస్సీ, ఎస్టీల ఆస్తులను ఆక్రమించడం జరగాలి. ఎఫ్‌ఐఆర్‌లో అలాంటి నేరారోపణ లేదు. బాధితుల పేర్లు స్పష్టంగా లేవు.
* అసైన్డ్ భూముల విషయంలో ఏపీ సీఆర్‌డీఏ చట్ట నిబంధనలు ఎస్సీ, ఎస్టీల భూముల పట్ల ఎలాంటి వివక్ష చూపలేదు. సదుద్దేశంతో చట్టనిబంధనలు రూపొందించిన వ్యక్తి, అధికారి, అథార్టీపై ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదని ఏపీ అసైన్‌మెంట్ భూముల బదిలీ నిషేధ చట్టంలోని సెక్షన్ 8 స్పష్టం చేస్తోంది.
- ఇదీ చదవండి: ప్రారంభమైన ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు