ఆదిలాబాద్ జిల్లా వాస్తవ్యుడు, గిరిజన కళాకారుడు కనకరాజుకి పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. 'గుస్సాడీ' నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కనకరాజు ఈ అవార్డుకి అన్నివిధాలా అర్హుడని అన్నారు. అతి సామాన్యుడైన గోండు గిరిజనుడిని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్పవిషయమని చెప్పారు. కనకరాజుకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది తెలంగాణలోని గిరిజనులకు, వారి సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపుగా దత్తాత్రేయ అభివర్ణించారు.
కర్నల్ సంతోష్ బాబు మాతృభూమి కోసం వీరమరణం పొందాడని, ఆయన త్యాగం వృథాగా పోదన్నారు. వారి సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర అవార్డు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా వారి సతీమణి సంతోషిని గవర్నర్ అభినందించారు. సంతోష్ బాబు త్యాగం, పరాక్రమం తోటి సైనికులకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
కర్నల్ కృష్ణ మోహన్‌కు కేంద్ర ప్రభుత్వ విశిష్ట సేవా మెడల్ రావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో వారు విశేష సేవలు అందించారని అన్నారు. అలాగే సైనికులకు శిక్షణ ఇవ్వడంలో కూడా వారు గొప్ప ప్రతిభ చూపారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కృష్ణ మోహన్, కర్నల్ సంతోష్ సతీమణి సంతోషి, కనకరాజులను ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. వీరిని గుర్తించి అవార్డులు అందజేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: శ్రీరాముడి పేరుతో భాజపా రాజకీయాలు: చల్లా ధర్మారెడ్డి