సీతారాముల కరుణాకటాక్షాలతో కరోనా రక్కసిని పారద్రోలి... దేశం ఆరోగ్యవంతం కావాలని శ్రీరాముడిని వేడుకుందామని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమస్త సమాజానికి ఆరాధ్య దైవం, రామచంద్రమూర్తి అని అన్నారు. సహనం, ధర్మం, స్నేహం వంటి సుగుణాల అయోధ్యారాముడి జీవితమే రామాయణం అని పేర్కొన్నారు.
మర్యాద పురుషోత్తముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమిని... ప్రతి యేడు శ్రీరామనవమిగా జరుపుకుంటామని వివరించారు. రావణుని వధించి, సీతా సమేతుడై దిగ్విజయంగా... అయోధ్యకు వచ్చిన రోజే... వారి కళ్యాణ మహోత్సవమును అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించాలంటే మాస్కులను విధిగా ధరించాలని... చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టీకాలను తీసుకోవడమే శ్రీరామరక్ష అని దత్తాత్రేయ పేర్కొన్నారు