రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం, ఉచిత నిర్బంధ విద్య చట్టాలు జీవిత కాలంలోనైనా అమలవుతాయా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్టాన్ని అమలు చేయాలని.. కొట్టివేయాలని కోరుతూ వేర్వేరు వాదనలతో 2010 నుంచి దాఖలైన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అన్ని పిటిషన్లపై కలిపి సోమవారం పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్ కుమార్ హైకోర్టుకు నివేదించారు.
పదేళ్లుగా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని.. అప్పటి నుంచి ఏం చేస్తున్నారని.. నిద్రపోతున్నారా అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కనీసం మన మనవళ్లు, మనవరాళ్లకైనా ఈ చట్టాలు అమలవుతాయా అని అసహనం వ్యక్తం చేసింది. నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడిందని.. హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని సంజీవ్ కుమార్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు లేఖలు రాసినప్పటికీ స్పందించడం లేదని.. ఖర్చుల్లో తన వాటాను ఇవ్వాల్సి ఉందని మాత్రం అంగీకరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. బడ్జెట్ వివాదాలు ఏవైనా ఉంటే ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చే ప్రసక్తే లేదని.. ఈనెల 18న తుది విచారణ చేపడతామని హైకోర్టు పేర్కొంది.