TS High Court on TSPSC Leak Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఈ నెల 24న వాదనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు వెల్లడించనుంది. సిట్ దర్యాప్తు సరైన దిశగా జరగడం లేదని.. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని వాదించిన పిటిషనర్లు.. సీబీఐకి ఇస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని కోర్టుకు తెలిపారు. సాంకేతిక కోణాల్లో దర్యాప్తు చేసే సామర్థ్యం సిట్‌కు లేదన్నారు.
HC Orders On TSPSC Leakage Case: దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా కొనసాగుతోందని.. సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి సీల్డ్ కవర్‌లో సిట్ సమర్పించిన నివేదికతో పాటు.. వాదనలు పరిగణనలోకి తీసుకొని ఇవాళ ఉత్తర్వులు వెల్లడిస్తామని తెలిపారు. దర్యాప్తు సంస్థను మార్చాలా లేదా సిట్‌లో మార్పులు చేయాలా అనే అంశం పరిశీలిస్తామని ఆరోజు హైకోర్టు పేర్కొంది.
TSPSC పేపర్ లీక్ కేసుపై హైకోర్టు: ప్రస్తుతం దర్యాప్తులో జోక్యం చేసుకోబోమన్న హైకోర్టు.. సిట్‌లోని సభ్యుల నైపుణ్యం గురించి అవసరమైతే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనర్లలో ఒకరి నివేదిక తెప్పించి వారి అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తుల నుంచి వాంగ్మూలాలు ఎందుకు సేకరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. రాజకీయ ప్రచారాల్లో భాగంగా దీని గురించి వారు ఎన్నో మాట్లాడుతుంటారని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి వారి నుంచి ఏదైనా కీలక సమాచారం రాబట్టారా అని న్యాయమూర్తి ఏజీని ప్రశ్నించారు. 45 రోజులు గడిచినా.. అసలు నిందితులను గుర్తించలేదా అని అడిగారు. బాధ్యులను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకన్న ఆయన.. కేసుపై విచారించడానికి శాఖలో అంతర్గత యంత్రాంగం లేదా అని ప్రశ్నించారు.
మన పిల్లలు పరీక్షలు రాస్తే ఆ బాధ తెలుస్తుంది: ఈ సందర్భంగా పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో మన కుటుంబీకులు, పిల్లలు ఉంటే ఆ బాధ మనకు అర్థమవుతుందని న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. పరీక్షల వాయిదా కావడం వలన అభ్యర్థులకు ఎంత ఇబ్బంది ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచించారు. ఒకసారి ఎగ్జామ్స్ రాసిన తర్వాత అవి రద్దయితే.. మరల తిరిగి రాయడం ఎంతో కష్టంగా ఉంటుందని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
సిట్‌లో నిపుణులున్నారు..: సిట్‌కు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తుండగా.. బృందంలో సైబర్ కేసులను దర్యాప్తు చేసే నిపుణులున్నారని ఏజీ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సమాచారం ఎక్కడున్నా తీసుకునే హక్కు పోలీసులకు ఉందన్న ఆయన.. పార్టీలకు చెందిన వారికి నోటీసులు ఇవ్వడం సబబేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిట్ దర్యాప్తు పారదర్శకంగానే జరుగుతోందని.. కేసులో నిందితులు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి సిట్ సమర్పించిన దర్యాప్తు నివేదికలను పరిశీలించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన నిర్ణయాన్ని చెబుతామన్నారు.
ఇవీ చదవండి: