ఎర్రమంజిల్‌లో శాసన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర మంత్రిమండలి జూన్ 18న చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగా లేదని స్పష్టం చేసింది. ఎర్రమంజిల్ భవనాలు పరిరక్షణ నిర్మాణాల పరిధిలోనే కొనసాగుతున్నాయని పేర్కొంది. ఎర్రమంజిల్‌లో భవనాలను కూల్చివేసి అసెంబ్లీ, శాసనమండలి, కమిటీ హాల్, స్పీకర్, మండలి ఛైర్మన్ నివాస సముదాయాలు నిర్మించాలన్న కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ఎనిమిది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సుమారు 150ఏళ్ల క్రితం నాటి ఎర్రమంజిల్ భవనాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్ల వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
పొంతనలేని సర్కారు వాదన:
పరిరక్షణ కట్టడాల పరిధిలోకి ఎర్రమంజిల్ భవనం రాదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 1981 నాటి జోనింగ్ నియంత్రణలోని 13వ నిబంధనను.... 2015లో ప్రభుత్వం తొలగించినందున... ఎర్రమంజిల్ భవనం పరిరక్షణ నిర్మాణాల పరిధిలోకి రాదన్న సర్కారు వాదన సహేతుకంగా లేదని పేర్కొంది. పట్టణ ప్రాంతాల చట్టం ప్రకారం.. ఆ నిబంధనను తొలగించే అధికారం హెచ్ఎండీఏకే ఉంటుంది కానీ.. ప్రభుత్వానికి ఉండదని స్పష్టం చేసింది.
కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ధర్మాసనం:
హెచ్ఎండీఏ జోన్ల ప్రకారం... ఎర్రమంజిల్ ప్రత్యేక రిజర్వేషన్ జోన్లో ఉన్నందున.. పరిరక్షణ కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ మాస్టర్ ప్లాన్ మార్చాలనుకున్నా.. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి.. అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుందని.. అలాంటివేమీ చేయలేదని హైకోర్టు పేర్కొంది. 13వ నిబంధన తొలగింపు ప్రక్రియే చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి.. దాని ఆధారంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేమని స్పష్టం చేసింది.
కూల్చొద్దు:
ప్రభుత్వం నమ్మశక్యం కాని విధంగా వాదించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. చారిత్రక నిర్మాణాలు.. వారసత్వ కట్టడాలు వేరన్న అదనపు ఏజీ వాదనను తోసిపుచ్చింది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు ఎంత ముఖ్యమో... గతాన్ని పరిరక్షించాల్సిన అవసరం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేసింది. వారసత్వ భవనాలు కూల్చివేయడమంటే.. ప్రజల అస్తిత్వాన్ని, నగర గుర్తింపును దోచుకున్నట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ భవనం నిజాం చరిత్రకు కీలక మైలురాయి అని.. హైదరాబాద్ నగర భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొంది. విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోర్టులే నిర్ణయాన్ని చెప్పకూడదు కానీ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా ఉందా లేదా అనే న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: ' ఎర్రమంజిల్‌లో భవనాల కూల్చివేతపై ప్రభుత్వానికి చుక్కెదురు'