ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటు చట్టవిరుద్ధమని... పొలాల మధ్య వెళ్లే ఈ రహదారి వల్ల 2 వేల మంది రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రైతుల అభ్యంతరాలను పరిష్కరించకుండా భూమిని స్వాధీనం చేసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రహదారి నిమిత్తం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్లను సవాలు చేస్తూ కె.రాజశేఖర్ రెడ్డి మరో 14 మంది రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిమిత్తం భూసేకరణ కోసం జాతీయ హైవే చట్టం సెక్షన్ 3ఏ కింద గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలలో నోటిఫికేషన్లు జారీ చేసిందని చెప్పారు. భూ సేకరణపై సెక్షన్ సీ కింద అదే ఏడాది డిసెంబరు 9న అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు చెప్పారు. అభ్యంతరాలను పరిష్కరించకుండా, భూసేకరణ ప్రక్రియ పూర్తికాకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పిటినషర్ తరఫు న్యాయవాది తెలిపారు. గత ప్రభుత్వం ఉన్న రహదారిని వెడల్పు చేయాలని నిర్ణయించిందన్నారు. వేల మంది రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపేలా ఉండే నోటిఫికేషన్లు జారీ చేసే ముందు ప్రభుత్వం కాస్త ఆలోచన చేయాల్సి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది, నేషనల్ హైవే అథారిటీ తరపు స్టాండింగ్ కౌన్సిళ్లు వాదనలు వినిపిస్తూ భూసేకరణ ప్రక్రియ సెక్షన్ బి ప్రకారం కొనసాగుతుందన్నారు. అభ్యంతరాలను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. వాదనలు విన్న కోర్టు.. రైతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వాటిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. అంతవరకు భూములు స్వాధీనం చేసుకోవడం గానీ వ్యవసాయ పనులను అడ్డుకోవడంగానీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.
ఇవీ చూడండి: గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ నివేదిక