ఉర్దూ మాధ్యమం విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు ఎందుకు బోధించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉర్దూలో కూడా ఆన్లైన్ పాఠాలు చెప్పేందుకు తగిన వసతులు కల్పించాలని పేర్కొంది. పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్, టీవీ పాఠాలు నిర్వహిస్తున్న పాఠశాల విద్యా శాఖ.. ఉర్దూ మీడియం విద్యార్థులకు బోధించడం లేదంటూ హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ సమీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
రాష్ట్రంలో ఉర్దూ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారని.. అలాంటప్పుడు ఆ భాషలో ఆన్లైన్ విద్యా బోధన ఎందుకు జరగడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఉర్దూలో ఆన్లైన్ పాఠాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఈ నెల 12లోగా తెలపాలని విద్యా శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబిత