High Court Questioned Why TSPSC Paper Leakage Case Transferred To CBI : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుపై సిట్ దర్యాప్తు జరుగుతున్నందున.. ప్రస్తుత దశలో సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు చురుగ్గా, నిష్పక్షపాతంగా జరుగుతోందని.. అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
నిందితుల్లో 37 మందిపై ఛార్జిషీట్ కూడా వేసినట్లు వివరించారు. సిట్ దర్యాప్తు పూర్తిస్థాయిలో జరగడం లేదని.. ఒత్తిళ్లకు గురవుతోందని.. అందుకే సీబీఐకి బదిలీ చేయాలని పిటిషనర్ల న్యాయవాదులు వాదించారు. సిట్ దర్యాప్తు జరుగుతుండగా.. ఇప్పుడు సీబీఐకి ఎందుకు బదిలీ చేయడం అని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సిట్‌ను, టీఎస్‌పీఎస్సీను జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ : టీఎస్‌పీస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇప్పటివరకు రూ.1.63 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఛార్జిషీట్‌లో సిట్ తెలిపింది.నిందితులను, వారికి సంబంధించిన బ్యాంకు వివరాలను, ఎవరెవరికి నగదు చేతులు మారిందనే వివరాలను అందులో తెలిపారు. ఇంకా ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
TSPSC Paper Leakage : ఈ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు 49 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశామని సిట్ ఛార్జిషీట్‌లో తెలిపింది. మరో 16 మంది మధ్యవర్తులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని అందులో పేర్కొన్నారు. గ్రూప్-1 రాసిన నిందితుడు ప్రశాంత్ న్యూజిలాండ్‌లో ఉన్నట్లు పొందుపరిచారు. డీఏవో పేపర్ 8 మందికి.. గ్రూప్-1 ప్రిలిమ్స్ నలుగురికి.. ఏఈఈ ప్రశ్నపత్రం 13 మందికి చేరినట్లు గుర్తించామన్నారు. గ్రూప్-1 పేపర్ చేరిన నలుగురిలో కమిషన్‌లో పనిచేసే ముగ్గురు.. ఇంకొక వ్యక్తి బయటవ్యక్తి అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉన్నట్లు అభియోగ పత్రంలో సిట్ పేర్కొంది.
49 People Arrested In TSPSC Paper Leakage Case : ఇటీవల అరెస్టయిన డీఈ పూల రమేశ్ సహకారంతో ఏఈఈ, డీఏవో పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను రామంతాపూర్‌లోని సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు చెప్పారు. వీటిని విశ్లేషిస్తున్న క్రమంలో మరికొంత సమాచారం బయటకు వచ్చినట్లు సిట్ బృందం అందులో వివరించింది. దీని ప్రకారం చూస్తే పూల రమేశ్ ఏఈఈ ప్రశ్నపత్రాన్ని మరికొంత మందికి విక్రయించినట్లు భావిస్తున్నామన్నారు. దీనివల్ల అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. అప్పుడు వారిని అరెస్టు చేసి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సిట్ అధికారులు ఛార్జిషీట్‌లో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :