2016లో వ్యాజ్యం దాఖలు... నేడు హైకోర్టులో విచారణ
తెలంగాణ సచివాలయం, శాసనసభ నిర్మాణ వ్యవహారంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేయద్దని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి 2016లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో విచారణ సందర్బంగా ప్రస్తుత సచివాలయం కూల్చబోమని అప్పటి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. హైకోర్టుకు ఇచ్చిన మాట మార్చి భవనాలు కూల్చివేస్తున్నారంటూ జీవన్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రేవంత్ పిల్‌పై విచారణ జరపనున్న ధర్మాసనం
జీవన్ రెడ్డితో పాటు.. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, మరో రెండు పిటిషన్లు కలిపి నేడు హైకోర్టు విచారణ జరపనుంది. సచివాలయం కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పైనా ఇవాళ విచారణ జరగనుంది. కొత్త శాసనసభ నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లో చారిత్రక భవనాలను కూల్చివేయద్దని కోరుతూ దాఖలైన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపైనా ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇవీ చూడండి: పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం