TRS MLAs Poaching Case Update: ఎమ్మెల్యేలకు ఎర కేసులో న్యాయవాది ప్రతాప్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరు కావాలని ఈనెల 22న ప్రతాప్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నోటీసులను సవాల్ చేస్తూ ప్రతాప్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. కేసులో నిందితుడిగా, అనుమానితుడిగా లేకపోయినప్పటికీ సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
నోటీసులను రద్దు చేయాలని.. రేపటి విచారణకు హాజరు కావల్సిన అవసరం లేకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతాప్ కోరారు. తగిన కారణాలున్నందునే ప్రతాప్‌కు సిట్ నోటీసులు ఇచ్చిందని.. ప్రస్తుత దశలో ఆధారాలన్నీ చూపలేరని ఏజీ, అదనపు ఏజీ వివరించారు. ప్రతాప్ విచారణకు హాజరుకాకపోతే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. విచారణ ఆలస్యమైతే ప్రతాప్ మొబైల్ ఫోన్లో సమాచారం తొలగించే ప్రమాదం ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు నోటీసు రద్దు చేసేందుకు నిరాకరిస్తూ రేపటి విచారణకు హాజరు కావాలని ప్రతాప్‌ను ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ప్రతాప్‌ను అరెస్టు చేయవద్దని.. నోటీసు నిబంధనలకు కట్టుబడి లేకపోతే.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని సిట్‌కు స్వేచ్ఛనిచ్చింది.
మరోవైపు ఇదే కేసులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణకు సిట్ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఈనెల 29న హాజరు కావాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈ కేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. వారితో పాటు సిట్ అధికారులు నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్‌పేట్‌కు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇవీ చదవండి: