ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతకు సంబంధించిన కేసులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. పలు పాత రాష్ట్రాలే కొత్త నగరాలు, అసెంబ్లీలను నిర్మిస్తున్నప్పుడు... కొత్త రాష్ట్రమైన తెలంగాణ నూతన శాసనసభను ఎందుకు నిర్మించుకోకూడదని హైకోర్టు ప్రశ్నించింది. భోపాల్, జైపూర్లో కొత్త అసెంబ్లీ భవనాలు నిర్మించారని... ఛండీగఢ్, అమృత్ సర్, పాటియాలా వంటి నగరాలనే నిర్మించారని పేర్కొంది. ప్రస్తుత భవనం అవసరాలకు సరిపోవడం లేదని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త అసెంబ్లీ నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని... దానికి ఎందుకు అనుమతించకూడదని అడిగింది. ఖాళీ స్థలాల్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే అభ్యంతరం లేదని... అయితే ఎర్రమంజిల్లో వారసత్వ కట్టడాలను పరిరక్షించాల్సిన బాధ్యత సర్కారుకు ఉందని పిటిషనర్ల తరఫున న్యాయవాది నళిన్ కుమార్ వాదించారు.
హైకోర్టు ఆదేశించినప్పటికీ... తెలంగాణలో చారిత్రక కట్టడాల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. పరిరక్షణ కట్టడాల జాబితా నుంచి వారసత్వ కట్టడాలను తొలగించడానికి హెచ్ఎండీఏకి అధికారం ఉందా అని ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది. హుడా స్థానంలో హెచ్ఎండీఏ చట్టం వచ్చినప్పటికీ... పాత చట్టంలోని అంశాలకు రక్షణ ఉంటుందని నళిన్ కుమార్ వాదించారు. ఎర్రమంజిల్ భవనాల కూల్చివేతకు సంబంధించి దాఖలైన పలు కేసుల విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఇవీ చూడండి: తృణధాన్యాల విత్తనాలకు పెరిగిన డిమాండ్